Health Benefits Of Lemon Water In The Morning : నిమ్మరసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల మన రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. అందుకే దినచర్యలో నిమ్మరసాన్ని భాగంగా చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ప్రత్యేకించి రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మంచిదని అంటారు. దీనివల్ల ఇంకా ఎన్నెన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక వ్యవస్థకు బలం
నిమ్మకాయల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తాగితే జలుబు, ఇన్ఫెక్షన్లు దరి చేరవు. ఇది ఏడాది పొడవునా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సీ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
జీర్ణక్రియకు దోహదకరం
నిమ్మరసం మన జీర్ణవ్యవస్థను కండీషన్‌లో ఉంచుతుంది. ఇది మన కడుపులో యాసిడ్ ఉత్పత్తి, పిత్త స్రావాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. ప్రేగుల కదలికలు మెరుగవుతాయి. ఉబ్బరం, ఛాతీలో మంట వంటి అజీర్తి లక్షణాలను తగ్గిస్తుంది.
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది
మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే ఆరోగ్యవంతంగా ఉండగలదు. నిమ్మరసం తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా తయారవుతుంది. చర్మంపై నిగారింపు కూడా వస్తుంది. అంటే మన చర్మ సౌందర్యాన్ని కూడా నిమ్మరసం ఇంప్రూవ్ చేయగలదు.
బరువు తగ్గడానికి దోహదకరం
బరువు తగ్గాలని భావించే వారు నిమ్మరసం తప్పకుండా తాగాలి. తొలుత మన జీవక్రియలను ఇది క్రమబద్దీకరిస్తుంది. తదుపరిగా మనం ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవాలి. నిమ్మరసం తాగుతూ ఇవి కూడా ఫాలో అయితే వెయిట్ లాస్ జరుగుతుంది. రోజూ కొంత సమయాన్ని తేలికపాటి వ్యాయామానికి కేటాయిస్తే ఈ దిశగా మంచి ఫలితాలు వస్తాయి.
చర్మ ఆరోగ్యం
నిమ్మరసంలో ఉండే విటమిన్ సీ వల్ల మన చర్మ ఆరోగ్యం మెరుగు అవుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. నిమ్మరసం తాగితే మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. ఫైనల్‌గా మనకు మెరిసే ఛాయ కలిగిన చర్మం సొంతం అవుతుంది. నిమ్మరసం తాగితే చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.