Raw Onions Health Benefits:"మజ్జిగన్నం, పచ్చి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ" ఎన్ని తరాలు మారినా ఈ కాంబినేషన్ మాత్రం మారదు. ఎందుకంటే ఇవి తింటే వచ్చే లాభాలు అనేకం. ముఖ్యంగా ఉల్లిపాయను చాలా మంది కూరలు, సాంబార్, పచ్చడి చేసుకుని తింటుంటారు. ఇంకొంతమంది వాటిని పచ్చిగానే తింటుంటారు. అయితే.. పచ్చిగా తినే వాటిలో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఉల్లి పోషకాలు:ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు అనే సామెత ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే.. ఉల్లిలో ఉండే పోషకాలు అటువంటివి. ఉల్లిపాయలో క్వెర్సెటిన్, యాంటీ అలర్జీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఉల్లిపాయలలో విటమిన్ ఎ, బి6, సి, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో రోజూ పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..
అలర్ట్ - ఈ లక్షణాలు మీ పాదాలపై కనిపిస్తే.. షుగర్ ఎక్కువగా ఉన్నట్టే!
క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది:రోజురోజుకి క్యాన్సర్స్ కేసులు పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రాణాంతక సమస్య ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అయితే పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఉల్లిపాయలలో.. ఆర్గానోసల్ఫర్, క్వెర్సెటిన్, ఆంథోసైనిన్లు అనే యాంటీకాన్సర్ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. NIH(National Institute of Health) ప్రకారం, ఇవన్నీ క్యాన్సర్‌ను నివారించడం, చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటాయి.
ముడతలు తగ్గించడంలో సాయం: ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా చర్మంపై ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల ఈ సమస్య తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఉల్లిపాయలలోని సల్ఫర్ కంటెంట్ కొల్లాజెన్ ఏర్పడటాన్ని పెంచుతుందని, అలాగే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాల చర్య ద్వారా అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుందని స్పష్టం చేస్తున్నారు.