తెలంగాణ

telangana

ETV Bharat / health

దోశ తినకున్నా ఏమీకాదు - కానీ, "దోస" తినకపోతే ఎన్నో ప్రయోజనాలు కోల్పోతారు!

-దోసకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -కూర, పచ్చడి.. ఏది చేసుకున్నా ఆహారంలో దోసను భాగం చేసుకోవాలట

Health Benefits of Cucumber
Health Benefits of Cucumber (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 14, 2024, 10:40 AM IST

Health Benefits of Cucumber:దోసకాయ.. మన దేశంలో ఎప్పటినుంచో సాగు చేస్తున్న ఒక కూరగాయ. ఈ కూరగాయతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అయితే ఇది వంటలకు కేవలం రుచినే కాదు శరీరానికి కావాల్సిన పోషకాల్నీ పుష్కలంగా అందిస్తుంది. నీటితో కూడిన ఇవి దాహం తీరటానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జబ్బుల నివారణకు, బరువు అదుపులో ఉండటానికి, జీర్ణక్రియకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దోసకాయ పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..

పోషకాలెన్నో:పుచ్చకాయ, గుమ్మడి జాతికి చెందిన దోసకాయల్లో కేలరీలు చాలా తక్కువ. పీచు, విటమిన్‌ ఎ, విటమిన్‌ కె, విటమిన్‌ సి, పొటాషియం, క్యాల్షియం వంటి పోషకాలెన్నో ఉంటాయని చెబుతున్నారు. 100 గ్రాముల దోసకాయలో.. 0.1 గ్రాముల కొవ్వు, 15 కేలరీలు, 3.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్​, 0.5 గ్రాముల ఫైబర్​, 1.7 గ్రాముల చక్కెర, 0.7 గ్రాముల ప్రొటీన్‌ ఉంటుంది. అత్యవసర పోషకాల విషయానికి వస్తే- 16.4 మైక్రోగ్రాముల విటమిన్‌ కె, 147 మిల్లీగ్రాముల పొటాషియం, 2.8 మిల్లీగ్రాముల విటమిన్‌ సి, 16 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తాయని.. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలివే:

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: దోసకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో ఫైబర్‌ ఎక్కువగాఉండటంతో పాటు కార్బోహైడ్రేట్స్​, చక్కెర తక్కువ ఉండటం వల్ల బరువు అదుపులో ఉండేందుకు సహాయపడుతుందని అంటున్నారు. పీచు.. పొట్టను నిండుగా చేసి.. ఆకలిని తగ్గిస్తుందని అంటున్నారు.

హైడ్రేషన్:దోసకాయలో 96 శాతం నీరు ఉంటుందని.. హైడ్రేషన్‌ వంటి సమస్యలను తగ్గించడంలో కీలకంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇదే విషయాన్ని NIH సభ్యుల బృందం కూడా స్పష్టం చేసింది(రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్​ చేయండి). అంతేకాకుండా శరీర వేడి వంటి సమస్యలతో బాధపడేవారు దీనిని తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు.

జీర్ణ వ్యవస్థకు మేలు:దోసకాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా ఎంతో సహాయపడుతుందని అంటున్నారు. అంతేకాకుండా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను కూడా ఎంతో సులభంగా తగ్గిస్తుందని వివరిస్తున్నారు.

చర్మ ఆరోగ్యం:దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి చర్మాన్ని అనేక సమస్యల నుంచి రక్షించేందుకు సహాయపడతాయని.. దీంతో పాటు ముడతలు పడకుండా నిరోధిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే చర్మాన్ని మృదువుగా చేస్తుందని అంటున్నారు.

రక్తపోటును నియంత్రిస్తుంది: దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో సిలికా, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు కండరాలు. ఎముకల, కణజాలాల అభివృద్ధికి మేలు చేసి.. కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోస్తుందని అంటున్నారు.

క్యాన్సర్‌ నివారణ: దోసకాయల్లో కుకుర్‌బిటాసిన్‌ బి (సీయూబీ) అనే వృక్ష రసాయనం అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందకుండానే కాదు, క్యాన్సర్‌ కణాల నిర్మూలనకూ ఉపయోగపడుతుందని అంటున్నారు. ముఖ్యంగా కాలేయం, రొమ్ము, ఊపిరితిత్తి, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో సీయూబీ పోరాడుతున్నట్టు పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. దోసకాయను పొట్టుతో తింటే ఇంకా మంచిది. ఎందుకంటే పొట్టు సైతం క్యాన్సర్‌ రాకుండా కాపాడగలదు. దీనిలోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తూ పెద్దపేగు క్యాన్సర్‌ నివారణకు సాయం చేస్తుందని అంటున్నారు.

గుండె బలంగా: దోసకాయలోని పొటాషియం.. సోడియం ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుందని అంటున్నారు. ఇందులో సోడియం తక్కువగా ఉండటం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రెండు రకాలుగా మేలు చేస్తుందని అంటున్నారు. దోసలోని సీయూబీ.. రక్తనాళాల్లో కొవ్వు పూడికలు ఏర్పడకుండా కాపాడుతుందని.. అంతేకాకుండా పీచు కొలెస్ట్రాల్‌ మోతాదులనూ తగ్గిస్తుందని అంటున్నారు. చూశారుగా.. దోసకాయ వల్ల కలిగే లాభాలు. కాబట్టి కూరగా వండుతారో, చట్నీ చేస్తారో లేదంటే పప్పులో, సాంబారులో కలిపి వినియోగిస్తారో మీ ఇష్టం, కానీ ఆహారంలో దోసని భాగం చేసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్నారా? జీర్ణకోశంలో ఈ సమస్యలు వస్తాయట! ఇవి పాటిస్తే అంతా సెట్!!

ఎక్కువ సేపు నిలబడుతున్నారా? బీపీ, గుండె జబ్బులు వస్తాయట జాగ్రత్త!!

ABOUT THE AUTHOR

...view details