Health Benefits Of Raw Papaya : బొప్పాయి.. సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో ఒకటి. ఇది రుచిగా ఉండడమే కాదు.. దీనిలో విటమిన్లు, మినరల్స్ సహా మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, సాధారణంగా బొప్పాయి(Papaya)ని అందరూ పండిన తర్వాతనే తింటారు. కానీ, బొప్పాయి కాయ దశలో ఉన్నప్పుడు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంతకీ, పచ్చి బొప్పాయి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :పచ్చి బొప్పాయిలోఉండే పాపైన్ వంటి ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలా ఇందులో ఉండే ఎంజైమ్‌లు కడుపులోని వ్యర్థాలను బయటకు పంపివేయడంలో సహాయపడతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
2010లో "జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మాకాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండుసార్లు 50 గ్రాముల పచ్చి బొప్పాయి ముక్కలు తిన్న వారిలో కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల లక్షణాలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ ది వెస్టిండీస్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ డేవిడ్ జె. మార్టిన్ పాల్గొన్నారు. పచ్చి బొప్పాయిలోని పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
క్యాన్సర్ నివారిస్తుంది : పచ్చి బొప్పాయి తినడం వల్ల పురుషులలో ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పెద్దప్రేగులో ఉండే టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఈ రకంగా పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడేలా చేస్తుందంటున్నారు.
గర్భవతులు బొప్పాయి, పైనాపిల్ తినొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?