Health Benefits of Ghee :నెయ్యి తీసుకోవడం వల్ల బాడీలో అనవసర కొవ్వులు పెరిగి లావవుతామేమోనని కొందరు, గుండెకు మంచిది కాదని మరికొందరు, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వేధిస్తాయని ఇంకొందరు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా భయపడుతుంటారు. ఒకవేళ తినాలని ఉన్నా సరే.. నోరు కట్టేసుకుంటారు. కానీ, వివిధ పోషకాల సమ్మేళనమైన నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా డైలీ మార్నింగ్ ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని(Ghee) ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఇంతకీ, ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నెయ్యిలో చాలా రకాల పోషకాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ఎ, డి, ఇ, కె వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా-3, ఒమేగా-6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు.. మొదలైన పోషకాలన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తాయట. అలాగే.. డైలీ డైట్లో నెయ్యిని చేర్చుకోవడం వల్ల శరీరంలోని నరాల పనితీరు మెరుగుపడుతుందంటున్నారు. ఇవేకాదు.. నెయ్యి వల్ల మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : రోజు ఉదయం పరగడుపున ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు ఇది ఆహారం సులభంగా అరగడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకాన్ని పోగొడుతుంది :మీరు మలబద్ధకంతో ఇబ్బందిపడుతున్నట్లయితే డైలీ మార్నింగ్ ఖాళీ కడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాగే మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
2018లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పరిగడుపున 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవడం మలబద్ధకం లక్షణాలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో 'ది ఫస్ట్ అఫిలియేటెడ్ హాస్పిటల్ ఆఫ్ నాంజింగ్ మెడికల్ యూనివర్సిటీ'కి చెందిన ప్రముఖ గాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. X.Y. Zhang పాల్గొన్నారు. ఖాళీ కడుపున నెయ్యి తీసుకోవడం వల్ల అందులోని పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
బరువును కంట్రోల్ చేస్తుంది : నెయ్యిని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం బరువు నిర్వహణలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెయ్యిలోని హెల్తీ ఫ్యాట్స్ ఆకలి కోరికలను తగ్గించి కడుపు నిండిన భావనను పెంపొందించడంలో చాలా బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు నిపుణులు.