Gastric Problem Solution In Telugu :ఈ కాలంలో చాలా మంది అజీర్తితో బాధపడుతున్నారు. ఒకప్పుడు ఈ సమస్యతో వృద్ధులు ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు వయసులో సంబంధం లేకుండా అనేక మందిలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అసలీ ఉదర సంబంధ సమస్యలు ఎందుకు వస్తాయి? వీటి లక్షణాలేంటి ? ఎలా పరిష్కరించుకోవాలి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సమయానికి భోజనం చేయకపోవడం
మనం సరైన సమయానికి ఆహారం తిననప్పుడు, కరెక్ట్ టైమ్‌కు నిద్రపోకపోతే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఏవైనా త్వరగా జీర్ణంకాని ఆహారం తీసుకుంటే అంటే స్పైసీగా ఉండేవి లేదా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్లు ఎక్కువగా తీసుకున్నా ఉదర సంబంధమైన సమస్యలు వస్తాయి. మానవ పేగు కండరంతో ఉండే గొట్టం. వివిధ రకాల ఒత్తిడుల వల్ల కూడా పేగుల మీద ప్రభావం పడుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏ రకమైన పదార్థాలు తినటం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది? ఇవన్నీ గమనిస్తే ముందే జాగ్రత్త పడవచ్చు. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి కూడా మందులు ఉంటాయి. ఇవన్నీ పాటించిన తర్వాతా ఈ సమస్య కొనసాగితే గ్యాస్ట్రో ఎంటరాలజీస్ట్ను సంప్రదించాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవండి
'పొట్ట ఉబ్బరం వల్ల వాంతులు కావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, మోషన్స్‌లో బ్లడ్ వస్తున్నా నిర్లక్ష్యం వహించకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది కేవలం అజీర్తి సమస్యే కాకపోవచ్చు. అల్సర్, ఇతర ఏ కారణాల వల్లనైనా లేదంటే గడ్డల వల్ల కూడా ఇలా జరగొచ్చు. ఈ లక్షణాలు గమనిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవడం ఉత్తమం. డైట్ పాటించడం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రోజూ వ్యాయామం చేయాలి. వీటితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ ఎప్పుడో ఒకప్పుడు తినొచ్చు. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.' అని గాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నవీన్ పోలవరపు సూచించారు.