Gas Bloating Causes and Treatment : ప్రస్తుత రోజుల్లో మనలో చాలామందికి పొట్టలో ఉబ్బరం, నొప్పి, గ్యాస్ బాధలు వంటివి బాగా పెరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, వీటి విషయంలో అజాగ్రత్తగా ఉంటే కొన్నిసార్లు తీవ్ర ఆరోగ్య సమస్యలు, ప్రాణాపాయానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి.. ఈ సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిదంటున్నారు. అసలు, పొట్ట ఉబ్బరం, నొప్పి, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి? నివారణ మార్గాలేంటి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నేటి రోజుల్లో గాడితప్పిన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణమంటున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగార్జున యార్లగడ్డ. అందులో ముఖ్యంగా టైమ్‌కు ఆహారం తినకపోవడం, వేగంగా తినడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, స్ట్రా ద్వారా ఎక్కువ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే, కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు, కారం, మసాలా పదార్థాలు అధికంగా తీసుకోవడం.. అతిగా ఆందోళన, ఒత్తిడికి గురవడం ఇవన్ని కూడా పొట్టలో గ్యాస్ బాధల్ని పెంచుతాయని చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా పైన పేర్కొన్నవి గ్యాస్ సమస్యలు రావడానికి కారణమవుతాయని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కొందరికి గ్యాస్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అది తినే ఫుడ్ వల్ల కావొచ్చు.. పొట్టలో ఇన్‌ఫెక్షన్ల వల్ల కావొచ్చు. ముఖ్యంగా బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీన్స్, కొన్నిసార్లు క్యారెట్లు, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు, కృత్రిమ స్వీటెనర్ల వల్ల పొట్టలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాంటి టైమ్‌లో ఆహారపు అలవాట్లలో మార్పులు, వ్యాయామం ద్వారా గ్యాస్ సమస్యలను కొంతవరకు తగ్గించుకోవచ్చు. అయితే, కొందరిలో ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందంటున్నారు డాక్టర్ యార్లగడ్డ నాగార్జున. కాబట్టి, అలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదంటున్నారు.
మలబద్ధకం కూడా కడుపులో గ్యాస్ పెరిగేలా చేస్తుందని సూచిస్తున్నారు. అలాగే, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్(ఐబీఎస్), ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్(ఐబీడీ), డైవర్టికులిటిస్, గ్యాస్ట్రోపరేసిస్ వంటి కూడా కడుపు ఉబ్బరం, గ్యాస్, నొప్పి సమస్యలకు కారణమవుతాయంటున్నారు. వీటితో పాటు కొన్నిసార్లు మనం నిత్యం వేసుకునే మందుల వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుందని చెబుతున్నారు.