తెలంగాణ

telangana

ETV Bharat / health

స్వీట్స్ ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా? అసలు డయాబెటిస్ ఎందుకు వ్యాపిస్తుంది? - EATING SWEETS CAN CAUSE DIABETES

-చక్కెర ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ వ్యాధి వస్తుందా? -అసలు షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందో మీకు తెలుసా?

Eating Sweets Can Cause Diabetes
Eating Sweets Can Cause Diabetes (Getty Images)

By ETV Bharat Health Team

Published : Jan 2, 2025, 1:09 PM IST

Eating Sweets Can Cause Diabetes: స్వీట్లు ఎక్కువగా తింటే డయాబెటిస్ బారిన పడతామా? చాలా మందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది. ఎందుకంటే మనలో చాలా మందికి స్వీట్లు అంటే ఎంతో ఇష్టం. ఇంకా చెప్పాలంటే రోజుకో స్వీటు, చాక్లెట్లు, పానీయాలు తీసుకోకుండా ఉండలేరు. వీరికి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. ఈ నేపథ్యంలో నిజంగానే స్వీట్లు ఎక్కువగా తింటే షుగర్ వ్యాధి వస్తుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం.

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. టైప్ 1 డయాబెటిస్ ఒక ఆటోఇమ్యూన్ వ్యాధి అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో రోగనిరోధక వ్యవస్థ.. ఇన్సూలిన్ ఉత్పత్తి చేసే కణాలపై దాడి చేస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి.. కణాలు చక్కెరను సరిగా వినియోగించుకోలేవని అంటున్నారు. ఈ క్రమంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ బారిన పడతారని వెల్లడిస్తున్నారు.

ఇక టైప్ 2 డయాబెటిస్ వ్యాధి మాత్రం ఆహారపు అలవాట్లు, జీవన శైలికి సంబంధించిన అంశాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చక్కెరలు అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే ఊబకాయం వచ్చి.. ఫలితంగా శరీరంలోని కీలక అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుంటుందని అంటున్నారు. దీంతో శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగి.. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి షుగర్ వ్యాధికి దారి తీస్తుందని వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే చక్కెరలతో కూడిన స్వీట్లు, పానీయాలు అధికంగా తాగే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 2010లో Diabetes Care జర్నల్​లో ప్రచుచరితమైన "Sugar-Sweetened Beverages and Risk of Metabolic Syndrome and Type 2 Diabetes" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. రోజుకు ఒకటి లేదా రెండు స్వీట్లు, చక్కెర పానీయాలు తాగినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు 26 శాతం మేర పెరుగుతాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. స్వీట్లు, డ్రింక్స్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి కొనసాగితే ఇన్సులిన్ నిరోధకత వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి షుగర్ వ్యాధి బారిన పడతారని వివరిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పరగడుపునే జ్యూసులు తాగొచ్చా? ఏ సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

'మెట్లు ఎక్కితే గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ తక్కువ'- రోజు ఎన్ని ఎక్కాలో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details