Constipation Health Risks :మలబద్ధకం సమస్య చాలామందికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రోజంతా ప్రశాంతంగా ఉండలేరు. మలవిరసర్జన కాక.. కడుపులో బరువుగా ఉన్నట్టు ఫీలవుతుంటారు. అయితే, ఈ సమస్య చూడడానికి చిన్నగానే అనిపించినా.. అనేక తీవ్రమైన రోగాల బారినపడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. "ది జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మలబద్ధకం సమస్య క్యాన్సర్‌కు దారితీయొచ్చట. దీంతోపాటు కాలేయ వ్యాధి, కడుపు ఇన్ఫెక్షన్, పేగు సంబంధిత వ్యాధులు వస్తాయని ఈ రీసెర్చ్‌లో పాల్గొన్న డాక్టర్ సతీశ్ రావు చెబుతున్నారు. మరి, ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వారానికి నాలుగు సార్లు కంటే తక్కువ మలవిసర్జన చేయడం లేదా విరస్జన సమయంలో ఎక్కువ శక్తిని ప్రయోగించాల్సి వస్తే దానిని మలబద్ధకంగా పిలుస్తారు. పెద్దపేగు ద్వారా మలం సరిగా వెళ్లనప్పుడు మలబద్ధకం సమస్య వస్తుంది. మల విసర్జన సరిగ్గా జరగకపోతే మలం నుంచి ఎక్కువ నీటిని శరీరం తీసుకుంటుంది. ఫలితంగా మలం పొడిగా, గట్టిగా మారి బయటకు విసర్జించడం చాలా కష్టంగా మారుతుంది.
మలబద్ధకం వల్ల బరువు కూడా పెరుగుతారు..
మలబద్ధకం సమస్య వల్ల ఊబకాయం కూడా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. మలబద్ధకం వల్ల ఊబకాయం బారిన పడతారని దిల్లీలోని ఎయిమ్స్‌లోని గ్యాస్ట్రోలజీ డాక్టర్ అన్నయ గుప్తా వెల్లడించారు. మలబద్ధకం కారణంగా శరీరంలోని జీవక్రియ మందగించి.. శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుందన్నారు. ఇలా కొవ్వు నిరంతరంగా పేరుకుపోవడం వల్ల బరువు పెరుగుతారని వివరించారు. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి కొన్నిసార్లు ఆకలి తక్కువగా వేస్తుందని.. మరి కొన్నిసార్లు సడెన్‌గా ఎక్కువ ఆకలిగా అనిపిస్తుందని చెప్పారు. ఫలితంగా ఆహారపు అలవాట్లలో విపరీతమైన మార్పులు జరిగి.. సమయం సందర్భం లేకుండా తింటూ చెడు జీవనశైలిని అవలంభిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని.. కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా చేసుకునే అవకాశం ఉందన్నారు.