Do Liver Detox Drinks Work :ఇటీవల కొంతమంది లివర్ డీటాక్స్ పేరుతో కొన్ని డ్రింక్స్, సొంత రెమిడీలు ప్రచారం చేస్తున్నారు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు వ్యర్థ పదార్థాలు(ట్యాక్సిన్లు) బయటకు వెళతాయన్నది దాని సారాంశం. మరి.. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
పసరు, పచ్చ పానీయాలతో కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎవరో చెబితే నమ్మకూడదని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఇప్పా విమలాకర్ రెడ్డి సూచిస్తున్నారు. ఆకులు ఏరుకొచ్చి కడుక్కోవడం, మిక్సీ వేసి రసం తాగడం అంతా వృథా ప్రయాస అంటున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆరుబయట మలవిసర్జన ఎక్కువ కాబట్టి.. అలాంటి చోట నుంచి తెచ్చిన ఆకుల్ని సరిగ్గా కడక్కపోయినా, ఉడకబెట్టకపోయినా అమీబియాసిస్ వచ్చేసి లివర్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వాటికి తోడు నులిపురుగులు లాంటివి కూడా పేగుల్లో పెరిగి మరిన్ని అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చని హెచ్చరిస్తున్నారు.
ఎవరో చెప్పారని, ఏవేవో పసర్లు తయారు చేసుకుని వాడుతూ ఇక వచ్చిన ఇబ్బందేమీ లేదంటూ.. మద్యపానం చేస్తే పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుంది. కాలేయానికి ఏదైనా విషం ఉందంటే ప్రధానంగా చెప్పుకోవాల్సిన వాటిలో ముందుండే పదార్థం ఆల్కహాలే. మందు ఏమాత్రం తాగినా అది సరాసరి కాలేయ కణాల్ని దెబ్బతీస్తుంది. పైగా అవి మానకుండా, కొత్తవి పుట్టకుండా, వాటి స్థానంలో ఫైబ్రోసిస్ (అంటే గట్టి పనికిరాని కణజాలాన్ని) ఏర్పడేలా చేస్తుంది. ఫలితంగా ఎంతో మృదువైన కాలేయం గట్టిపడి పోయి చివరికి పనికి రాకుండా అవుతుంది. కాలేయంలో కొవ్వు చేరడాన్నే ఫ్యాటీ లివర్ సమస్యగా పిలుస్తారు. సహజంగా కాలేయంలో కొద్దిగానే కొవ్వు ఉంటుంది. కానీ, అది మోతాదును మించి (5శాతం) ఉంటే దానిని ఫ్యాటీ లివర్ అంటారు. కాలేయంలో లివర్ కణాలు మాత్రమే ఉండాలి. కానీ, ఆ కణాల మధ్య కొవ్వు చేరితే దానిని ఫ్యాటీ లివర్గా భావిస్తారు. శరీర బరువు, ఆహారం, ఆల్కహాల్, మద్యం, మధుమేహం, రక్తపోటుపై ఫ్యాటీ లివర్ సమస్య ఆధార పడి ఉంటుంది. ఇది చాప కింద నీరులా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
- డాక్టర్ ఇప్పా విమలాకర్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్