Diet Tips For Kids: పిల్లలకు సమతుల్య ఆహారాన్ని అందించడం తల్లిదండ్రులకు చాలా పెద్ద సమస్య. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, షుగర్ డిలైట్స్ వంటి ఆకర్షణీయమైన ఆహార పదార్థాలు ఉన్న ఈ రోజుల్లో పిల్లలకు ఆరోగ్యరకరమైన ఆహారాన్ని తినిపించడం అస్సలు ఈజీ కాదు. అయినా ప్రయత్నించక తప్పదు. పిల్లలకు పోషకాలతో నిండిన ఆహారాన్ని తినిపించడమే కాకుండా వారి ఆలోచనలు, ఆహారపు అలవాట్లు జీవితకాలం కొనసాగేలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత. అలా పిల్లలకు సరైన ఆహారాన్ని అందించాలని, ఆరోగ్యకరమైన భవిష్యత్తునివ్వాలి అనుకునే తల్లిదండ్రులకు ఈ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి.
పోషకాహారం తప్పనిసరి
పిల్లలకు చక్కటి డైట్ ప్లాన్ చేసే ముందు తల్లిదండ్రులు చేయాల్సిన పనేంటంటే, వారికి సమతుల్య ఆహారం అంటే ఏంటో అర్థం అయ్యేలా చేయడం. వాటి వల్ల ఉపయోగాలేంటో వివరంగా చెప్పడం. వివిధ రకాల పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఖనిజాలు కలిగిన ఆహారాలను సమతుల్య ఆహారం అంటారు. అలాగే ఇతర ఆరోగ్య ప్రయోజనాల కోసం పిల్లలు తప్పకుండా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి ప్రొటీన్లు కలిగిన ఆహారాలను, పాలను తప్పకుండా తీసుకోవాలి.
ఎంత తింటున్నారో చూసుకోవాలి
పిల్లలు ఏం తింటున్నారు అనే దాంతో పాటు ఎంత తింటున్నారు అనేది కూడా ముఖ్యమే. వయసుకు మించి ఆహారం తినడం వల్ల చిన్నతనంలోనే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది చాలా ప్రమాదకరమైనది కూడా. వయసుకు తగిన ఆహారం తగినంత పరిమాణంలోనే తింటేనే పిల్లలు జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు డైట్ ప్లాన్ చేయాలి.
ముందే ప్లానింగ్ చేసుకోవాలి
వారానికి ఒకసారి మీల్ ప్లానింగ్ చేయడం వల్ల మీ బిడ్డలు సమతుల్య ఆహారాన్ని తీసుకునేలా చేయడం సులువు అవుతుంది. పిల్లల ఫుడ్ విషయంలో ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఏ రోజు ఏ అల్పాహారం చేయాలి, ఏ పూట ఏం భోజనం సిద్ధం చేయాలి, అలాగే స్నాక్స్, రాత్రి భోజనానికి ఏయే ఆహారపదార్థాలు చేసి తినిపించాలో ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇది మీ పిల్లలకు సరైన పోషక విలువలతో కూడిన ఆహారాలను అందించడం సులభతరం చేస్తుంది. అలాగే మీ సమయాన్ని కూడా వృథా కానివ్వదు.
భిన్న ఆహారాలు
పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాలు తినిపించడమే కాకుండా ఇష్టమైన ఆహారాలు చేసి పెట్టడం కూడా చాలా అవసరం. ఆరోగ్యంగా మార్చే పద్ధతిలో భాగంగా వారికి ఇష్టమైన వాటికి దూరంగా ఉంచితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదముంది. ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారాలు తినడం ఎవ్వరికీ నచ్చదు విసుగు పుడుతుంది. కాబట్టి వీలైనంత వరకూ పిల్లలకు ఎక్కువ వెరైటీలు చేసి పెడుతుండాలి. వేరు వేరు రుచులు, వేర్వేరు పదార్థాలు చేసి పెట్టడం వల్ల పిల్లలకు ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది.