తెలంగాణ

telangana

ETV Bharat / health

మధ్యాహ్నం నిద్రపోతే మొటిమలు రావట! పగటి పూట కునుకుతో ఎన్నో లాభాలు! - DAY TIME SLEEP BENEFITS

-మధ్యాహ్నాం నిద్రతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న నిపుణులు -పగటి నిద్రతో జీర్ణక్రియ, జ్ఞాపకశక్తి మెరుగవుతుందని వెల్లడి

Day Time Sleep Benefits
Day Time Sleep Benefits (Getty Images)

By ETV Bharat Health Team

Published : Nov 18, 2024, 1:27 PM IST

Updated : Nov 18, 2024, 2:40 PM IST

Day Time Sleep Benefits:మనలో చాలా మందికి మధ్యాహ్నం అన్నం తినగానే నిద్ర కమ్ముకువస్తుంది. అయితే, మధ్యాహ్నం నిద్ర పోతే రాత్రి సరిగ్గా నిద్రపట్టదని అనుకుంటారు. ఇక మరికొందరు ఆఫీస్‌లో ఉండడం, ఇంట్లో తీరికలేని పనులతో.. కునుకు తీసేందుకు సమయమే ఉండదు. కానీ వయసు సంబంధం లేకుండా అందరూ మధ్యాహ్నం కాసేపు నిద్ర పోతే ఎంతో మేలు కలగుతుందనిని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంతో పాటు.. సోమరితనం తగ్గి చేసే పనులపై మరింత శ్రద్ధ పెట్టగలుగుతామని నిపుణులు అంటున్నారు.

  • మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని జర్నల్ ఆఫ్ అమెరికా హార్ట్ అసోసియేషన్​ అధ్యయనంలో తేలింది. నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్​స్టిట్యూట్ (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చేపట్టిన ఈ అధ్యయనంలో అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నవారు, ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలకు చికిత్సలు తీసుకుంటున్న వారికి మరింత మేలని తేలింది.
  • శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్‌, థైరాయిడ్‌, స్థూలకాయం, మధుమేహం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తుంటాయి. అయితే, ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతులమవుతాయని.. ఫలితంగా ఆయా సమస్యలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
  • చాలా మందిలో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వంటివి సహజంగానే వస్తుంటాయి. అయితే మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.
  • ఇంకా విశ్రాంతి లేకుండా పని చేయడం, మధ్యాహ్నం నిద్రపోకపోవడం వల్ల మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతాం. దీని ప్రభావం అందంపై పడుతుందని.. మొటిమలు, చుండ్రుకు కారణమవుతుందని చెబుతున్నారు. కాబట్టి భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీయడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా సౌందర్యాన్నీ కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
  • మనలో చాలా మంది మధ్యాహ్నం పడుకుంటే రాత్రి నిద్ర రాదని అనుకుంటారు. కానీ పగటి నిద్ర వల్ల రాత్రి నిద్రకు ఎలాంటి అంతరాయం కలగదని, పైగా ఇది రాత్రి నిద్రను ఇది ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు, పదే పదే ప్రయాణాల్లో అలసిపోయిన వారు, పండగలు-ఫంక్షన్లతో తీరిక లేకుండా గడిపే వారికి మధ్యాహ్నం నిద్ర మరింత సాంత్వన చేకూర్చుతుందని అంటున్నారు.
  • కొంతమంది వ్యాయామాలతో, మరికొందరు ఆరోగ్య సమస్యలతో నీరసిస్తుంటారు. ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల శరీరం పునరుత్తేజితమై.. ఆయా సమస్యల నుంచీ త్వరగా బయటపడగలుగుతారని అంటున్నారు.
  • ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా ఉత్సాహం, పనిలో నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు నిద్రపోవడం వల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుందని పలు అధ్యయనాల్లోనూ బయటపడింది.

ఎప్పుడు? ఎంతసేపు? ఏ పొజిషన్‌లో నిద్రపోవాలి?

  • మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1-3 గంటల్లోపు ఎప్పుడైనా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • పెద్దలకు 10-30 నిమిషాలు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, అనారోగ్యాలతో బాధపడుతోన్న వారికి 90 నిమిషాల నిద్ర సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
  • ఇంట్లో ఉన్న వారు మంచంపై కునుకు తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎడమవైపునకు తిరిగి కడుపులోని పిండం మాదిరిగా ముడుచుకొని పడుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఆఫీస్‌లో ఉన్న వారు ఆఫీసు నిబంధనలు అనుమతిస్తే భోజన విరామ సమయంలో తమ ముందున్న డెస్క్‌పై తలవాల్చి నిద్రపోవచ్చని అంటున్నారు.
  • ఒకవేళ మంచం సౌకర్యం లేనివారు.. సౌకర్యవంతంగా ఉన్న కుర్చీలో కూర్చొని కునుకు తీయచ్చని చెబుతున్నారు.

ఇలా చేయద్దు!

  • అయితే, మధ్యాహ్నం నిద్రపోయే విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలే కాకుండా చేయకూడని పనులూ కొన్ని ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..!
  • అయితే, కొంత మంది రోజంతా తీరిక లేకుండా గడిపి సాయంత్రం పూట చిన్న కునుకు తీస్తుంటారు. ఇది మంచిది కాదని.. ముఖ్యంగా సాయంత్రం 4-7 గంటల మధ్యలో అస్సలు నిద్రపోకూడదని నిపుణులు చెబుతున్నారు.
  • భోజనం చేసిన తర్వాత కొంతమందికి టీ, కాఫీ తాగడం, చాక్లెట్స్‌ తినే అలవాటు ఉంటుంది. వీటివల్ల నిద్ర భంగం అవడంతో పాటు శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.
  • మనలో చాలా మందికి మొబైల్‌, టీవీ చూస్తూ నిద్రపోవడం అలవాటు ఉంటుంది. కానీ దీనివల్ల నిద్రాభంగం కలగడంతో పాటు ఒత్తిడీ పెరుగుతుందని నిపుణలు వివరించారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? నడకతో ప్రయోజనాలు తెలిస్తే షాక్!

బరువు తగ్గేందుకు రోజుకు ఎన్ని మెట్లు ఎక్కాలి? ఇది తెలిస్తే లిఫ్ట్​ కూడా వాడరు!

Last Updated : Nov 18, 2024, 2:40 PM IST

ABOUT THE AUTHOR

...view details