Crying Benefits For Health: మనిషి శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే బాధ, అసంతృప్తి, సంతోషం వంటి రకరకాల భావోద్వేగాల కారణంగా బయటకు వచ్చే ఎమోషన్ ఏడుపు. కానీ ఏడిస్తే ఎవ్వరికీ నచ్చదు. కంట నీరు పెడితే ఇంటికి మంచిది కాదు. ఒంటికి మంచిది కాదు అంటూ ఏవేవో చెప్పి ఏడుపును అదుపు చేయిస్తుంటారు. నిజానికి ఏడుపు కూడా ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శరీరం, మనసుపై పడే ఒత్తిడిని తగ్గించడానికి, భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడానికి ఏడుపు బాగా సహాయపడుతుంది. ఏడవటం వల్ల ఇబ్బంది, అసౌకర్యం వంటి అనుభూతుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. కన్నీళ్లు కార్చడం ద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఓదార్పు
నిపుణులు, రీసెర్చర్లు కనుగొన్న దాని ప్రకారం ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుంది. ఏడవటం వల్ల చాలా మందికి ఓదార్పు కలుగుతుంది. తమ భావోద్వేగాలను కంటి నీరు ద్వారా బయటపెట్టడం వల్ల విశ్రాంతిగా ఫీలవుతారు.
నొప్పి నివారణ
కన్నీళ్ల వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇవి శారీరకంగా, మానసికంగా ఎదుర్కొనే సహజమైన నొప్పులను తగ్గిస్తాయి. మనసుపై భారం, ఒత్తిడి పెరిగి ప్రమాదకరంగా మారకుండా ఉండేందుకు ఏడుపు చక్కగా ఉపయెగపడుతుంది.
మానసిక స్థితి
ఏడ్చినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హర్మోన్ మనకు మంచి అనుభూతిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే సుఖంగా, మానసికంగా మెరుగ్గా ఉండటానికి కూడా ఏడుపు సహాయపడుతుంది.