తెలంగాణ

telangana

ETV Bharat / health

కపుల్ ఎక్సర్​సైజుతో ఈజీగా బరువు తగ్గచ్చట! మరి ఎలా చేయాలో తెలుసా? - COUPLE EXERCISE FOR WEIGHT LOSS

-భార్యభర్తలు ఇద్దరూ కలిసి వ్యాయామం చేస్తే సూపర్ బెనిఫిట్స్ -ఈజీ ఎక్సర్​సైజులు ఎలా చేయాలో వివరిస్తున్న నిపుణులు

Couple Exercise for Weight Loss
Couple Exercise for Weight Loss (Getty Images)

By ETV Bharat Health Team

Published : 24 hours ago

Couple Exercise for Weight Loss: భార్యాభర్తలిద్దరూ కలిసి వ్యాయామం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సమయం లేకో, ఇద్దరి పనివేళలు వేరుగా ఉండడం వల్లో కలిసి వ్యాయామాలు చేసే వీలు చాలామందికి దొరక్కపోవచ్చు. కానీ కేవలం ఓ పావుగంట సమయం కేటాయించి ఈ చిన్నపాటి వ్యాయామాలు దంపతులిద్దరూ కలిసి సాధన చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అటు బరువు తగ్గడంతో పాటు ఇటు దాంపత్య బంధాన్నీ దృఢం చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కపుల్‌ ఎక్సర్‌సైజెస్‌ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రష్యన్‌ ట్విస్ట్‌:ఇందుకోసం దంపతులిద్దరూ ఒకరి వీపు మరొకరికి తగిలేలా కూర్చోవాలి. ఆపై మోకాళ్లు మడుచుకుని పాదాల్ని నేలకు ఆనించాలి. ఇప్పుడు కాస్త చిన్న సైజులో ఉన్న జిమ్‌ బాల్‌ను ఒకరికొకరు అందించుకోవాలట. ఒకసారి కుడి వైపు నుంచి, మరోసారి ఎడమ వైపు నుంచి అందించుకుంటూ వ్యాయామం చేయాలి. 'రష్యన్‌ ట్విస్ట్‌'గా పిలిచే ఈ వ్యాయామంలో భాగంగా శరీర భాగాలు కదలకుండా, కేవలం చేతులు మాత్రమే కదిలిస్తుండాలి. ఇలా ఆయా శరీర భాగాలపై ఒత్తిడి పడి అక్కడి కొవ్వు కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. 2018లో Journal of Strength and Conditioning Research ప్రచురితమైన "The Effects of Russian Twists on Core Strength and Stability" అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. అలాగే ఈ వ్యాయామం ఎదురెదురుగా కూర్చొని, ఒక కాలుపై నిల్చొని.. ఇలా విభిన్న భంగిమల్లో చేయచ్చని అంటున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ప్లాంక్‌ విత్‌ ఎ క్లాప్‌:ఇందుకోసం భార్యాభర్తలిద్దరూ ఎదురెదురుగా ప్లాంక్‌ పొజిషన్‌లో కూర్చోవాలి. ఇప్పుడు తమ శరీర భారాన్ని మొత్తం కుడి చేతిపై మోపి.. ఇరువురి ఎడమ చేతుల్ని కలుపుతూ చప్పట్లు కొట్టాలి. ఆ ఆతర్వాత ఇదే విధంగా ఎడమ చేతిపై శరీర భారాన్ని మోపుతూ.. కుడి చేతులతో చప్పట్లు కొట్టాలి. ఇలా చేతులు మార్చుతూ పావు గంట పాటు ఈ 'ప్లాంక్‌ విత్‌ ఎ క్లాప్‌' వ్యాయామాన్ని కొనసాగించాలని నిపుణులు అంటున్నారు.

లెగ్‌ లిఫ్ట్‌:ముందుగా దంపతుల్లో ఒకరు నేలపై వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత మరొకరు వీరి తల వద్ద నిటారుగా నిల్చొని చేతులు ముందుకు చాపాలి. ఇప్పుడు పడుకున్న వ్యక్తి తన కాళ్లను నిటారుగా పైకి లేపుతూ.. నిల్చున్న వ్యక్తి చేతుల్ని తాకించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేసిన తర్వాత.. ఇద్దరూ తమ తమ స్థానాల్ని మార్చుకొని ఇలాగే సాధన చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పుషప్స్‌:ఇందుకోసం భార్యాభర్తల్లో ఒకరు ప్లాంక్‌ పొజిషన్‌లో ఉండి.. మరొకరు వీరి కాళ్ల వద్ద నిల్చొని పాదాల్ని పైకి లేపి పట్టుకోవాలి. ఇప్పుడు ప్లాంక్‌ పొజిషన్‌లో ఉన్న వారు తమ శరీరాన్ని పైకి, కిందికి కదిలిస్తూ పుషప్స్‌ చేయాలని నిపుణులు అంటున్నారు. ఆపై ఇద్దరూ పొజిషన్స్‌ మార్చి మరోసారి ఈ 'పుషప్స్‌' వర్కవుట్‌ రిపీట్‌ చేయాలని చెబుతున్నారు.

హ్యాండ్‌ హోల్డింగ్‌ స్క్వాట్స్‌:ముందుగా ఇద్దరూ ఎదురెదురుగా నిల్చొని కాస్త వంగుతూ ఒకరి చేతులు మరొకరు పట్టుకోవాలి. ఆ తర్వాత గుంజీలు తీయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా పలుమార్లు రిపీట్‌ చేయడం వల్ల ఇద్దరికీ ఏకకాలంలో వ్యాయామం చేసిన ఫలితం దక్కుతుందని వివరిస్తున్నారు.

బ్యాండ్‌ జంప్‌:ఇందుకోసం దంపతులిద్దరూ ఒకరి వెనుక మరొకరు నిల్చోవాలి. ఇప్పుడు ముందు నిల్చున్న వారి నడుముకు ఎక్సర్‌సైజ్‌ బ్యాండ్‌ అమర్చుకొని.. వెనక ఉన్న వారు దీన్ని పట్టుకోవాలి. ఆ తర్వాత ముందున్న వారు దీన్ని వీలైనంత సాగదీస్తూ ముందుకు జంప్‌ లేదంటే పరిగెత్తచ్చని నిపుణులు అంటున్నారు. ఈ 'బ్యాండ్‌ జంప్‌' వ్యాయామాన్ని కొన్నిసార్లు రిపీట్‌ చేసిన తర్వాత.. వారి పొజిషన్స్‌ మార్చుకొని తిరిగి పునరావృతం చేయాలని చెబుతున్నారు.

స్కిప్పింగ్‌:ఇంకా సులభంగా ఇద్దరూ ఎదురెదురుగా నిల్చొని కలిసి 'స్కిప్పింగ్‌' సాధన చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే విడివిడిగానైనా ఈ వ్యాయామం చేయచ్చని అంటున్నారు.

ఈ తరహా వ్యాయామాలు చేయడానికి సులభంగానే కనిపించినా.. ఆయా శరీర భాగాలపై ఒత్తిడి కలగజేస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ఫలితంగా కొ కరిగి బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. ఇదే కాకుండా ఇద్దరూ కలిసి సరదాగా వీటిని సాధన చేయడం వల్ల కష్టంగానూ అనిపించదని.. ఇంకా ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుందని అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చెప్పులు లేకుండా నడుస్తున్నారా? హర్మోన్ ఇంబ్యాలెన్స్​కు ఇలా చెక్ పెట్టొచ్చు!

కళ్ల కింద క్యారీ బ్యాగులు వచ్చాయా? ఇలా చేస్తే ఈజీగా పోతాయట!

ABOUT THE AUTHOR

...view details