Side Effects of Drinking Cool Drinks :సమ్మర్లో కూల్‌డ్రింక్స్(Cool Drinks), సోడా వంటివి తాగితే.. ఎండ వేడి నుంచి వెంటనే రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ, ఆ తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.
బరువు పెరుగుతారు : సాధారణంగా 250 -300 మిల్లీ లీటర్ల కూల్ డ్రింక్‌లో 150-200 కేలరీలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్‌లో అధిక ఫ్రక్టోజ్ ఉంటుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా.. డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి సమ్మర్లోనే కాదు ఏ కాలంలోనైనా వీలైనంత వరకు కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు.
జీర్ణ సమస్యలు : కూల్ డ్రింక్స్‌లో ఫాస్పరిక్ యాసిడ్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి కాంపనెంట్ హైడ్రాలిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది. ఇది మన పొట్టలోనే ఉత్పత్తి అవుతుంది. కూల్‌డ్రింక్స్ తాగినప్పుడు అందులో ఉండే రసాయనం ఈ యాసిడ్‌తో కలిసినప్పుడు జీవక్రియల మీద విపరీతమైన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా వివిధ జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.
ఫ్యాటీ లివర్ సమస్య : కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం ఉందట. శీతలపానీయాలు తీసుకోవడం వల్ల అదనపు పరిమాణం ఫ్రక్టోజ్ కాలేయానికి చేరుకుంటుంది. దాంతో అది ఓవర్‌లోడ్ అయ్యి కొవ్వుగా మారుతుందంటున్నారు. దీని కారణంగా లివర్‌లో కొవ్వు పేరుకుపోవడం స్టార్ట్ అవుతుందట. ఫలితంగా కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.
2020లో 'హెపటాలజీ' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. సమ్మర్లో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వ్యక్తులకు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, కాలేయ వాపు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ జోసెఫ్ టి. కాల్‌ఫ్లైష్ పాల్గొన్నారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వ్యక్తులకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.