తెలంగాణ

telangana

ETV Bharat / health

అలర్ట్‌ : కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణాలివే! - అస్సలు లైట్‌గా తీసుకోవద్దు! - Kidney problems in telugu

Causes Of Kidney Damage : మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని కాపాడుకుంటేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అయితే.. మనం చేసే తప్పుల వల్ల ఇవి తొందరగా పాడైపోతున్నాయని నిపుణులంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Causes Of Kidney Damage
Causes Of Kidney Damage

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 11:40 AM IST

Causes Of Kidney Damage :మానవ శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలకంగా పని చేసే అవయవాలలో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలో జీవక్రియల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కిడ్నీలు నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల వల్ల పాడైపోతున్నాయి. దీనివల్ల.. చాలా మందిలో కిడ్నీ సమస్యలు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలు డ్యామేజ్ కావడానికి ముఖ్య కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కిడ్నీ సమస్యలు రావడానికి గల కారణాలు..

షుగర్‌ అదుపులో లేకపోవడం..
మన రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మూత్రపిండాలలోని రక్త నాళాలకు హాని కలుగుతుందని.. ఇది 'డయాబెటిక్ నెఫ్రోపతీ' అనే పరిస్థితికి దారితీస్తుందని అంటున్నారు. ఈ డయాబెటిక్ నెఫ్రోపతీ వల్ల కిడ్నీలలో రక్తంలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్‌ చేసే సామర్థ్యం తగ్గిపోతుందని తెలియజేస్తున్నారు. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే కిడ్నీలు పనిచేయకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు.

హైబీపీ (అధిక రక్తపోటు)..
హైబీపీ సమస్యతో బాధపడేవారిలో కూడా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాల్లోని రక్తనాళాలపై అధిక ఒత్తిడి కలుగుతుందని నిపుణులంటున్నారు. దీనివల్ల రక్తనాళాలు బలహీనమై క్రమంగా కిడ్నీలు పనిచేయకుండా దెబ్బతీస్తుందని తెలియజేస్తున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఆహారంలో తక్కువ ఉప్పును తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలని చెబుతున్నారు.

ఎక్కువగా పెయిన్‌ కిల్లర్లు తీసుకోవడం..
నొప్పులను నివారించే ఐబుప్రోఫెన్‌ (ibuprofen), ఆస్పిరిన్‌ (aspirin) వంటి మందులను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నాన్‌స్టేరాయోడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమెటరీ డ్రగ్స్‌ (Nonsteroidal anti-inflammatory drugs (NSAIDs) ) వంటివి కూడా కిడ్నీ సమస్యలకు దారీతీస్తాయని అంటున్నారు. ఇవి కిడ్నీలకు రక్తప్రసరణను తగ్గిస్తాయట. అందుకే వీటిని వైద్యులు సూచించిన ప్రకారం మాత్రమే వినియోగించాలని అంటున్నారు.

డీహైడ్రేషన్..
మన శరీరానికి తగినంత నీరు అందకపోతే కూడా కిడ్నీలు డ్యామేజ్‌ అవుతాయని నిపుణులంటున్నారు. బాడీలో వాటర్‌ శాతం తక్కువైతే మూత్రపిండాలు ఒత్తిడికి గురవుతాయని చెబుతున్నారు. దీంతో వ్యర్థాలను ఫిల్టర్‌ చేయడం కిడ్నీలకు సవాలుగా మారుతుందట. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే కిడ్నీ సమస్యకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. కనీసం రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఇది వ్యక్తి బరువు, అతను చేసే శారీరక శ్రమను బట్టి మారుతుందని అంటున్నారు.

ధూమపానం, మద్యం ఎక్కువగా సేవించడం..
ధూమపానం, మద్యం ఎక్కువగా సేవించడం వంటి చెడు వ్యసనాల వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని నిపుణులంటున్నారు. పొగ తాగడం వల్ల కిడ్నీలలో ఉండే రక్తనాళాలు గట్టిపడతాయట. దీనివల్ల అవి సక్రమంగా పని చేయకుండా పోతాయని అంటున్నారు. అలాగే దీర్ఘకాలికంగా మద్యం తాగడం వల్ల కిడ్నీల పనితీరు తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే పొగతాగే అలవాటును పూర్తిగా మానేసి, మద్యం సేవించడాన్ని పరిమితం చేసుకోవాలని సూచిస్తున్నారు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి..

  • సమతుల ఆహారాన్ని రోజువారి దినచర్యలో భాగం చేసుకోవాలి.
  • ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయలు తినాలి.
  • పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే తృణధాన్యాలను డైలీలైఫ్‌లో తప్పకుండా తినాలి.
  • ప్రతిరోజూ శారీరక శ్రమను కలిగించే నడక, వ్యాయామం, సైక్లింగ్, పరుగు వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.
  • కిడ్నీ సమస్యలు ఏవైనా కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

బార్లీ గింజల నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయా?

'మద్యం తాగుతున్నారా? అయితే త్వరగా ముసలివారు అయిపోతారు'

Dialysis: కిడ్నీల సమస్యను ఎలా గుర్తించాలి? అసలు డయాలిసిస్ ఎవరికి అవసరం?

ABOUT THE AUTHOR

...view details