తెలంగాణ

telangana

ETV Bharat / health

తిన్న తర్వాత కడుపులో నొప్పి, మంటగా ఉంటుందా? వదిలేస్తే క్యాన్సర్​గా మారే ఛాన్స్​! - STOMACH PAIN LEADS TO CANCER

-చిన్నపాటి జాగ్రత్తలతో పెద్ద జబ్బులకు చెక్‌ -మంచి ఆహారం, శుద్ధమైన తాగునీరు, చేతుల శుభ్రతతో ఆరోగ్యం సురక్షితం

Stomach Pain linked to cancer
Stomach Pain linked to cancer (ANI)

By ETV Bharat Health Team

Published : Nov 10, 2024, 12:32 PM IST

Stomach Pain Leads to Cancer: మనలో చాలామంది ఏదైనా తిన్న వెంటనే కడుపులో నొప్పి, మంట, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. ఇంకా కొందరు ఏదైనా కారం పదార్థాలు లేదా పిజ్జా తిన్నా సరే ఇబ్బంది పడుతుంటారు. అయితే, వీరిలో ఒక శాతం మందిలో మాత్రమే తీవ్ర కడుపునొప్పి, వాంతులు, రక్తం పడడం, బరువు కోల్పోవడం వంటివి ఉంటాయని నోబెల్‌ పురస్కార గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్‌ యూనివర్సిటీ క్లినికల్‌ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బ్యారీ మార్షల్‌ చెబుతున్నారు. ఇలా తరచూ బాధ పడుతున్నారంటే.. పొట్టలో ఏదో సమస్య ఉన్నట్లే గుర్తించి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.

"మనం ఎదుర్కొనే అనేక వ్యాధులను అతి తేలికైన జాగ్రత్తలతో తగ్గించుకోవచ్చు. కేవలం చేతులను శుభ్రంగా ఉంచుకుంటే.. కలరా, డయేరియా, కామెర్లు, టైఫాయిడ్‌ వంటి రోగాల బారినపడకుండా జాగ్రత్తపడొచ్చు. తినే తిండి, తాగే నీరు శుద్ధిగా ఉంటే.. మన శరీరం అంతే ఆరోగ్యంగా ఉంటుంది. శుభ్రతపై అజాగ్రత్త వహిస్తే శరీరంపై జబ్బులు దాడిచేస్తాయి. ముఖ్యంగా ప్రమాదకరమైన హెలికోబ్యాక్టర్‌ పైలోరీ (హెచ్‌ పైలోరీ) అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మొదట్లో కడుపు ఉబ్బరం, గ్యాస్, పొట్టలో మంట, నోటి దుర్వాసన వంటి లక్షణాలతో సమస్య ప్రారంభమవుతుంది. తర్వాత అల్సర్లను సృష్టించి బాధపెడుతూ... ప్రమాదకరమైన క్యాన్సర్‌గానూ రూపాంతరం చెందుతుంది. దాదాపు 80% మందిలో దీని లక్షణాలేవీ కనిపించకపోగా కేవలం 20% మందిలోనే తేలికపాటిగా కనిపిస్తాయి. విరేచనాలు, వాంతులు, రక్తం పడుతుందంటే మాత్రం సమస్య తీవ్రరూపం దాల్చినట్లే. భారత్, అమెరికా, చైనా, ఆస్ట్రేలియా దేశాలతోపాటు ఆఫ్రికా, యూరప్‌ ఖండాల్లోనూ ఎక్కువ మంది ఈ బ్యాక్టీరియా సమస్యతో బాధపడుతున్నారు. భారత్‌లో మధుమేహుల సంఖ్య కంటే పదింతలు అధికంగా ఈ బ్యాక్టీరియా బాధితులుంటారని అంచనా."

-డాక్టర్‌ బ్యారీ మార్షల్‌, నోబెల్‌ పురస్కార గ్రహీత, ఆస్ట్రేలియా వెస్ట్రన్‌ యూనివర్సిటీ క్లినికల్‌ మైక్రోబయాలజీ ప్రొఫెసర్‌

ఒకరి నుంచి ఒకరికి ఎలా సోకుతుంది?
మన నోట్లోని లాలాజలం ద్వారా ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని డాక్టర్ బ్యారీ మార్షల్‌ చెబుతున్నారు. సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరికి హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా ఉంటే.. అందరికీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. తల్లి నుంచి పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందే అవకాశాలెక్కువని మార్షల్‌ అంటున్నారు. తల్లి పొట్టలో ఉన్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా ఆమె నోట్లోని లాలాజలంలోకి చేరి.. ఆ తర్వాత ఆమె తన చేతులను నోటి దగ్గర తుడుచుకొని.. అవే చేతులతో పిల్లలను తాకినప్పుడు వారికి ఈ బ్యాక్టీరియా చేరుతుందన్నారు. ఆమె చేతుల్లోని ఆహారం ద్వారా కూడా పిల్లలకు చేరుతుందని వెల్లడించారు.

ప్రమాదకరంగా మారుతుందా?
హెచ్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా అందరిలోనూ తీవ్ర ప్రభావం చూపించదని డాక్టర్ బ్యారీ మార్షల్‌ చెబుతున్నారు. ప్రస్తుతం దీనికి గల కారణాలపై పరిశోధనలు జరుగుతున్నాయని.. జనాభాలోని 20% మందిలోనే అల్సర్లు ఏర్పడే అవకాశాలుంటాయని తెలిపారు. ఈ బ్యాక్టీరియా జీర్ణాశయంలోని పైపొర ఉపరితలంపై ఉండి.. అక్కడి జిగురు వ్యవస్థను దెబ్బతీస్తుందని వివరించారు. జబ్బు తీవ్రమయ్యే వరకు గుర్తించలేకపోతే చికిత్స కూడా కష్టమవుతుందని హెచ్చరించారు. హెచ్‌ పైలోరీ శరీరంలోకి ప్రవేశించిన పది, పదిహేనేళ్ల తర్వాత పొట్టలో ఆమ్లాల శాతం గణనీయంగా తగ్గిపోతుందని వెల్లడించారు. అలాంటి ఒక శాతం మంది క్యాన్సర్‌ బారినపడడానికి అవకాశాలెక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో... 20% మందికి అల్సర్లు, 1% మందికి క్యాన్సర్లు వస్తే అది పెద్ద సంఖ్యే అవుతుందని అభిప్రాయపడ్డారు. దీని ఉనికిని శ్వాస, మల, రక్త పరీక్షలు, ఎండోస్కోపీ పరీక్షల ద్వారా నిర్ధరించవచ్చని చెబుతున్నారు. రెండు వారాలపాటు యాంటీ బయాటిక్స్‌తో చికిత్స అందిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. చికిత్స తర్వాత పూర్తిగా నయమైందా? లేదా? అని తెలుసుకోవడానికి మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు.

చిన్నారుల్లో ఈ బ్యాక్టీరియా లక్షణాలను ఎలా గుర్తించాలి?
పెద్దలతో పోలిస్తే పిల్లల్లో లక్షణాలు పెద్దగా కనిపించవని.. వారికి చికిత్స కూడా కష్టమేనని ఆయన తెలిపారు. ఎందుకంటే పిల్లలకు పెద్దల మాదిరిగా యాంటీ బయాటిక్స్‌ను ఇవ్వలేమని.. ఎక్కువగా ఇస్తే వారిలో యాంటీ బయాటిక్స్‌ నిరోధకత పెరిగే ప్రమాదముందని వెల్లడించారు. అందుకే ఇంట్లో శుభ్రతను పాటించడం ద్వారా పిల్లలకు సోకకుండా జాగ్రత్తపడవచ్చని సూచించారు. అయితే యాంటీ బయాటిక్స్‌ విచ్చలవిడి వాడకంతో అవసరమున్నప్పుడు అవి పనిచేయడంలేదని.. అందుకే వీటి వాడకంపై నియంత్రణ అవసరమని సలహా ఇస్తున్నారు.

ఈ బ్యాక్టీరియా ఒంట్లో ఉన్నట్లు ఎలా గుర్తించాలి?
ఈ బ్యాక్టీరియా లక్షణాలను ప్రత్యేకంగా ఇవీ అని చెప్పలేకుండా ఉంటాయని చెబుతున్నారు. తీవ్రమైన కడుపునొప్పి, రక్తం పడడం, వాంతులు, బరువు కోల్పోవడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారంటే పొట్టలో ఏదో సమస్య ఉన్నట్లే గుర్తించి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. స్వల్ప లక్షణాలు కనిపించిన వారైనా హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియాకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కుటుంబంలో జీర్ణకోశ క్యాన్సర్లు, అల్సర్ల చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. కొందరు కారం, పిజ్జా తిన్నా పడడం లేదని.. కడుపులో మంటగా ఉందంటుంటారు. కానీ నిజానికి కారం, పిజ్జాలతో కాదని.. జీర్ణాశయంలో చేరిన బ్యాక్టీరియా వల్ల అప్పటికే ఇన్‌ఫ్లమేషన్‌ ఉన్నప్పుడు దాని మీద కారం పడితే మంటగా అనిపిస్తుందంటున్నారు. అందుకే దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌లకు సంబంధించిన పరీక్షలను చేయించుకోవాలని డాక్టర్ బ్యారీ మార్షల్‌ సూచించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్వల్ప లక్షణాలు ఉన్న సమయంలో యోగర్ట్‌/పెరుగు వంటి ప్రోబయాటిక్స్‌ వాడితే ఉపశమనంగా ఉంటుందని డాక్టర్ బ్యారీ మార్షల్‌ వెల్లడించారు. పూర్తిగా నయమవాలంటే మాత్రం యాంటీబయాటిక్స్‌ వాడాల్సిందేనని స్పష్టం చేశారు. మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోకున్నా ప్రమాదమేనని తెలిపారు. అలాంటి వారి చేతుల నుంచి బ్యాక్టీరియా తాగునీటిలోకి చేరే అవకాశముందని హెచ్చరించారు. మంచి ఆహారం, శుద్ధమైన తాగునీరు, చేతుల శుభ్రత ద్వారా జాగ్రత్తపడొచ్చని వివరించారు.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

హై బీపీకి మందులు వాడట్లేదా? మతిమరుపు వచ్చే ఛాన్స్ ఉంది జాగ్రత్త!

నడుస్తుంటే కాళ్లు, పిక్కల్లో తీవ్రమైన నొప్పా? లేట్ చేస్తే కట్ చేయాల్సి వస్తుందట!

ABOUT THE AUTHOR

...view details