తెలంగాణ

telangana

పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే ఆ అవయవాలపై ప్రభావం! - Antibiotics For Kids

By ETV Bharat Health Team

Published : Aug 26, 2024, 5:09 PM IST

Antibiotics For Children: కొంతమంది జలుబు, దగ్గు, ఫీవర్​ వంటి లక్షణాలు కనిపిస్తే.. వైద్యులను సంప్రదించకుండానే యాంటీ బయాటిక్స్​ వాడుతుంటారు. పిల్లలకు కూడా ఇలానే ఇస్తుంటారు. అయితే, పిల్లలకు యాంటీ బయాటిక్స్​ ఇచ్చే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. లేదంటే పలు సమస్యలు తప్పవంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Antibiotics
Antibiotics For Children (ETV Bharat)

Can Antibiotics Be Given to Children:ప్రస్తుత కాలంలో యాంటీబయాటిక్స్​ మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది పలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించకుండానే వీటిని వాడుతుంటారు. కొంతమంది తల్లిదండ్రులు.. పిల్లలకు జ్వరం, తలనొప్పి, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు ఇబ్బందిపెట్టినప్పుడు కూడా వైద్యులను సంప్రదించకుండా.. గతంలో వారు సూచించిన యాంటీబయాటిక్స్​ ట్యాబ్లెట్లు లేదా సిరప్​లు వాడుతుంటారు. అయితే, ఇలా వైద్యుల సలహా లేకుండా పిల్లలకు యాంటీబయాటిక్స్​ ఇవ్వకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటి వల్ల పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

సాధారణంగా పిల్లలకు వైరస్​, బ్యాక్టీరియాల వల్ల ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్​ వస్తుంటాయి. ఆ సమస్యలను వైద్యులు గుర్తించి యాంటీ బయాటిక్స్ వాడమని సలహా ఇస్తుంటారు. ఇక అవి వాడిన తర్వాత సమస్య తగ్గిపోతుంది. మళ్లీ ఎప్పుడైనా పిల్లల్లో అలాంటి అనారోగ్య సమస్యలే కనిపిస్తే.. వైద్యుల సూచన లేకుండానే యాంటీబయాటిక్స్​ కొంతమంది వాడుతుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని ప్రముఖ పిడియాట్రిషియన్​ 'డాక్టర్​ భవాని' అంటున్నారు. కాబట్టి, పిల్లల్లో అనారోగ్య సమస్యలు కనిపించిన ప్రతిసారీ వైద్యులను సంప్రదించి వారు సూచించిన మేరకు మాత్రమే యాంటీబయాటిక్స్​ వాడాలని డాక్టర్​ భవాని సూచిస్తున్నారు.

"యాంటీబయాటిక్స్​తో కొన్ని రకాల మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి, పిల్లలకు యాంటీ బయాటిక్స్​ అందించే ముందు జాగ్రత్తగా ఉండాలి. అయితే, చాలా వరకు పిల్లల్లో కనిపించే చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు 3 నుంచి 5 రోజుల వరకు యాంటీబయాటిక్స్​​ వాడమని వైద్యులు సూచిస్తుంటారు. ఏదైనా మూత్రనాళ ఇన్ఫెక్షన్​ ఉందని నిర్ధారించినప్పుడు 10-14 రోజులు ఈ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా అనారోగ్య సమస్యలను బట్టి వైద్యులు సూచించిన కోర్స్​ ప్రకారం యాంటీబయాటిక్స్​ వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఇక పిల్లలకు అలర్జీలు, వైరల్​, బ్యాక్టీరియల్​, ఫంగల్​ ఇన్ఫెక్షన్లు వంటివి నిర్ధారణ అయిన తర్వాతే యాంటీబయాటిక్స్​ వాడమని వైద్యులు సూచిస్తుంటారు. పిల్లల్లో వాంతులు, విరేచనాల వంటి రెండు మూడు రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ మందులు వాడాల్సి వస్తుంది. "-డాక్టర్​ భవాని

యాంటీబయాటిక్స్​ అధికంగా వాడితే కలిగే అనర్థాలు :

  • యాంటీ బయాటిక్స్​ ఎక్కువగా వాడడం వల్ల శరీరంలోని కాలేయం పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
  • పిల్లలకు వెంటవెంటనే యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్ల కిడ్నీల మీద ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
  • యాంటీ బయాటిక్స్ శరీరంలోని మంచి బ్యాక్టీరియాను కూడా నాశనం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుందని.. దీంతో పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారని అంటున్నారు.
  • కొన్ని యాంటీ బయాటిక్స్ వల్ల వికారం, వాంతులు, అతిసారం, చర్మంపై దురద, అలర్జీలు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.

యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే?

  • పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి వారి చుట్టూ ఉండే ప్రదేశాలను శుభ్రంగా ఉంచాలి.
  • వారు ఆడుకునే ఆటబొమ్మలను శుభ్రంగా ఉంచాలి.
  • దిండ్లు, కార్పెట్లు లాంటి వాటిని ఎప్పటికప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి.
  • మంచి ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించాలి.
  • ఈ జాగ్రత్తలు పాటిస్తే పిల్లలు హెల్దీగా ఉంటారు.
  • చివరిగా యాంటీ బయాటిక్స్​ వల్ల ఎన్ని ప్రయోజనాలుంటాయో, అన్ని నష్టాలుంటాయి. కాబట్టి, తప్పనిసరిగా వైద్యులు సూచించిన మేరకు మాత్రమే ఉపయోగించాలి.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

యాంటీబయాటిక్స్‌ అతిగా వాడేస్తున్నారా?.. లాభం కన్నా నష్టమే అధికం!

మందులతో మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చా? - నిపుణుల మాటేంటి?

ABOUT THE AUTHOR

...view details