Best Tips for Reduce Excess Oil in Your Foods:కూరలో సరిపడా ఆయిల్, ఉప్పు, కారం, మసాలాలు వేసుకున్నప్పుడే అది రుచికరంగా ఉంటుంది. అందులో ఏది ఎక్కువైనా కూర రుచే మారిపోతుంది. ముఖ్యంగా నూనె ఎక్కువైతే.. ఆ కూర చప్పగా ఉండి అస్సలు తినాలనిపించదు. అలాగే నూనె(Oil) అధికంగా ఉన్నవి తీసుకుంటే ఆరోగ్యం సైతం దెబ్బతింటుంది. ఎంతో కష్టపడి వండిన వంట ఆయిల్ ఎక్కువయిందనే కారణంగా పక్కన పెట్టేస్తే చాలా బాధగా అనిపిస్తుంది. అయితే అలాంటి సమయంలో ఇకపై మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ టిప్స్ గుర్తుంచుకుంటే చాలు.. వండిన వంట నుంచి ఈజీగా నూనెను తొలగించి ఎంతో రుచికరంగా మార్చవచ్చు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
బ్రెడ్ :కూరలో నూనె ఎక్కువ అయినప్పుడు మీ కిచెన్‌లో బ్రెడ్ అందుబాటులో ఉంటే వాటితో ఈజీగా ఆయిల్ తొలగించవచ్చు. ఇందుకోసం మీరు బ్రెడ్ ముక్కలను కాస్త డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని నూనె ఎక్కువైన కర్రీలో కలపాలి. అవసరమయితే వేడి చేయాలి. అంతే కూరలోని అదనపు ఆయిల్‌ను బ్రెడ్ ముక్కలు గ్రహించి.. రుచిని అలాగే ఉంచుతాయి. ఆ తర్వాత వాటిని తీసేసి నోరూరించే ఆ కర్రీని తినవచ్చు.
ఉడికించిన బంగాళదుంపలు :ఇవి కూడా మీరు చేసిన కూరలో నూనె ఎక్కువ అయితే తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకోసం మీరు కొన్ని ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని.. ఆయిల్ ఎక్కువ ఉన్న కూరలో వేసి మూత పెట్టకుండా ఐదు నిమిషాలు ఉడికించాలి. అప్పుడు కర్రీలోని అదనపు నూనెను బంగాళదుంపలు గ్రహిస్తాయి. ఆ తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ టేస్టీ కర్రీని తినొచ్చు.