Health Benefits of Buttermilk :రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో బయట పనుల మీద వెళ్లిన చాలా మంది వేసవి తాపం నుంచి రిలీఫ్ పొందేందుకు ఏవేవో కూల్‌డ్రింక్స్ తాగుతుంటారు. వాటిని తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభించవచ్చేమో కానీ, తర్వాత అవి వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా మీరు వేసవి కాలంలో ఎండలో బయటకు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ(Buttermilk)తాగడం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగను హిందీలో 'చాచ్' అని పిలుస్తారు. నిజానికి సమ్మర్లో మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. మండే ఎండలో వచ్చే వ్యక్తికి బటర్ మిల్క్ ఇవ్వడం వల్ల దప్పిక తీరడంతో పాటు మంచి ఉపశమనం కూడా లభిస్తుంది. అంతేకాదు.. సమ్మర్ బెస్ట్ డ్రింక్‌గా చెప్పుకునే మజ్జిగ వల్ల ఇంకెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకమైన, రుచికరమైన పానీయం : వేసవి తాపాన్ని తగ్గించే పదార్థాల్లో మజ్జిగ ముందు వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇది పోషకాలతో నిండి ఉండే రుచికరమైన పానీయం. దీనిలో విటమిన్ బి 12, కాల్షియం, పొటాషియం వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కెలరీలు, కొవ్వు శాతం కూడా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇదొక మంచి డ్రింక్‌గా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా దీనిలో పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్ వంటి ఉపయుక్తమైన బాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా బాగా సహాయడుతుందని చెబుతున్నారు నిపుణులు. మజ్జిగ తీసుకోవడం వల్ల ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, విరేచనాలు, వాంతులు వంటి ప్రాబ్లమ్స్ ఇట్టే తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా మజ్జిగలో ప్రోబయోటిక్ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతాయని చెబుతున్నారు. 2016లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. మజ్జిగ తాగే వ్యక్తులలో, మజ్జిగ తాగని వారి కంటే జీర్ణక్రియ సమస్యలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.