Best Homemade Drinks for Summer:సమ్మర్ డ్రింక్స్ విషయానికొస్తే.. చాలా మంది మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకురసం.. వంటివి తీసుకుంటుంటారు. అయితే, వీటితో పాటు ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే, తక్షణమే శరీరానికి చల్లదనాన్ని అందించే కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్ ఉన్నాయి. కొన్నిరకాల పండ్లు, కూరగాయలు, తులసి, పుదీనా లాంటి ప్రత్యేకమైన ఆకులు వాటర్‌లో యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొనే ఈ డ్రింక్స్(Drinks) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు, ఖనిజాలు.. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడటమే కాకుండా మలినాలను తొలగించి బాడీని కూల్‌గా ఉంచుతాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటి ఆ డ్రింక్స్? వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మకాయ షర్బత్ :ఇది సమ్మర్ హోమ్ మేడ్ డ్రింక్స్‌లో మొదటి వరుసలో ఉంటుంది. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. ముందుగా ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, పంచదార లేదా తేనె యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే.. హెల్దీ నిమ్మకాయ షర్బత్ రెడీ!
పుచ్చకాయ వాటర్ :వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఈ ఫ్రూట్ సమ్మర్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ ఫ్రూట్‌తో ప్రిపేర్ చేసుకునే డ్రింక్ కూడా వేసవిలో శరీరాన్ని చల్లబర్చడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం.. ఒక లీటరు వాటర్ తీసుకొని అందులో అరకప్పు చొప్పున పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. వీలుంటే.. నాలుగు కీరా ముక్కలు, కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేసుకోని తాగడమే..
2017లో 'జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ & మెడిసిన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పుచ్చకాయ వాటర్ వేడి వాతావరణంలో చెమట ద్వారా కోల్పోయే ద్రవాలను భర్తీ చేయడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుందని వెల్లడైంది. ఈ పరిశోధనలో బ్రెజిల్‌కు చెందిన ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియాలజీ డా. మార్కోస్ డి. బార్బోసా పాల్గొన్నారు. సమ్మర్లో పుచ్చకాయ వాటర్ హైడ్రేషన్ స్థాయిలను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలా? ఈ 5 'సూపర్ ఫ్రూట్స్' తింటే చాలు!
కీరా పుదీనా డ్రింక్ :ఈ హోమ్ మేడ్ డ్రింక్ కూడా వేసవి వేడిని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని అందులో కీరా ముక్కలు, నిమ్మకాయ ముక్కలు, కొన్ని పుదీనా లేదా తులసి ఆకులు వేసుకోవాలి. అనంతరం దాన్ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత తాగండి. దీనిని తాగడం వల్ల డీహైడ్రేషన్ దరిచేరదు. అంతేకాదు.. నిమ్మకాయలోని ఎలక్ట్రోలైట్లు శరీరానికి శక్తినిచ్చి రోజంతా ఉత్సాహంగా ఉండడానికి తోడ్పడతాయంటున్నారు నిపుణులు.