Best Foods to Lower High BP:మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు.. ఇలా కారణాలు ఏమైతేనేమి వృద్ధాప్యంలో రావాల్సిన అనారోగ్య సమస్యలు 40 ఏళ్ల లోనే వచ్చేస్తున్నాయి. అందులో హైబీపీ కూడా ఒకటి. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బీపీ నార్మల్కు వచ్చేందుకు మందులు వాడుతుంటారు. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తారు. అయినా.. రక్తపోటు అదుపులో ఉండట్లేదని వాపోతుంటారు. అయితే.. మెడిసిన్ వాడడం, ఉప్పును తగ్గించిన మాత్రాన బీపీ కంట్రోల్లోకి వచ్చేయదంటున్నారు నిపుణులు. రక్తపోటు కంట్రోల్లో ఉండాలంటే.. కొన్ని ఫుడ్స్‌ను ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
సిట్రస్ పండ్లు:పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రోజుకు 400 గ్రాముల ఫ్రూట్స్‌ను తినాలని సలహా ఇచ్చింది. బీపీ అదుపులో ఉండడానికి సిట్రస్ పండ్లు చాలా మేలు చేస్తాయట. వీటిలో పుష్కలంగా ఉండే పొటాషియం, శరీరంలోని అధిక సోడియంను బయటకు పంపి, రక్తనాళాలను సడలించడంలో సహాయపడతాయని.. తద్వారా రక్తపోటు తగ్గించడానికి దోహదపడతాయని అంటున్నారు. అందుకే.. ద్రాక్ష, నారింజ, నిమ్మ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ విషయాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు సంబంధించిన "నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్" వెబ్సైట్లో ప్రచురించింది.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చేపలు: హైబీపీతో బాధపడే వారు చేపలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాలను సడలించి, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయంటున్నారు. అంతేకాకుండా, ఇవి రక్తం గడ్డకట్టకుండా చేసి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు.
ఆకుకూరలు: ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి మేలు చేసే వాటిలో ముందుంటాయి. ముఖ్యంగా పాలకూర, బచ్చలికూర వంటి వాటిలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయని.. బీపీని అదుపులో ఉంచుతుందని అంటున్నారు. అలాగే వీటిల్లోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
గింజలు: ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా, హైబీపీని నియంత్రించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి ఫైబర్, అర్జినైన్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయని.. అర్జినైన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుందంటున్నారు. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విశాలం చేయడానికి సహాయపడుతుందని.. దీంతో రక్త ప్రవాహం సులభంగా జరిగి, రక్తపోటు తగ్గుతుందని అంటున్నారు.