Ayurveda Treatment For Sciatica Pain : మనలో చాలా మంది ఎప్పుడో ఒకసారి నడుము నొప్పితో బాధపడుతుంటారు. అయితే, కొంతమందిలో నడుము నొప్పితో పాటు నడుస్తున్నప్పుడు భరించలేనంతగా నొప్పి కలుగుతుంటుంది. కాలి పిక్కల నుంచి మొదలై పిరుదుల గుండా వీపులోకి నొప్పి పాకుతుంటుంది. ఈ రకమైన సమస్యను సయాటికాగా పిలుస్తారు వైద్యులు. వీపు నుంచి పాదంలోకి వెళ్లే సయాటికా నరం ఒత్తిడికి గురైనప్పుడు సయాటికా బాధ వేధిస్తుంటుంది. తీవ్రమైన నొప్పిని కలిగించే ఈ సయాటికాకు మన సంప్రదాయ ఆయుర్వేద వైద్యం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి.. హైదరాబాద్కు చెందిన ఆయుర్వేద ఫిజీషియన్ "డాక్టర్ పెద్ది రమాదేవి" సమాధానం చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
సయాటికా నరం మన శరీరంలో పొడవైనది. ఇది వెన్ను నుంచి మొదలై పిరుదుల నుంచి పిక్కలకు.. అక్కడ నుంచి దిగువకు ప్రయాణించి పాదాలను చేరుకుంటుంది. సయాటికా నరం ఉన్న భాగంలో ఎక్కడ ఏ చిన్న నరం ఒత్తిడికి గురైనా.. నడుములోనూ, కాళ్లలోనూ భరించలేని నొప్పిని తెచ్చిపెడుతుంది.
"ఆయుర్వేదంలో సయాటికాను 'గుద్రసీ వాతం' అని పిలుస్తారు. సయాటికా సమస్యతో బాధపడేవారిలో కొన్నిసార్లు స్పర్శ లేకుండా ఉంటుంది. అలాగే కాళ్లకు రక్తప్రసరణ ఆగి బిగుసుకు పోయే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఒక కాలు నొప్పిగా ఉంటే.. మరికొంతమందిలో రెండు కాళ్లు కూడా నొప్పిగా ఉంటాయి. ఈ సమస్య యాక్సిడెంట్ వల్ల గానీ, ఏదైనా గాయాలైనప్పుడు రావొచ్చు. అలాగే బరువులు మోయడం, కింద పడడం, కొన్ని రకాల విటమిన్ల లోపాల వల్ల కూడా ఈ సమస్య వేధిస్తుంది." - డాక్టర్ పెద్ది రమాదేవి (ఆయుర్వేద ఫిజీషియన్)
ఆయుర్వేద చిట్కాలు :
- సయాటికా సమస్య ఉన్నవారు ఆ నరంపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.
- వాపు ఉన్న కాలును కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
- ప్లాస్టిక్ కవర్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని నొప్పిఉన్న చోట, ముఖ్యంగా నడుము మీద కాపడం పెడితే మంచి ఫలితం ఉంటుంది.
- అలాగే కొద్దిగా ఇసుకకి నీళ్లు కలిపి వేడి చేసి.. మూట కట్టి నొప్పి కలిగిన చోట ఒత్తిడి పెట్టినా సయాటికా నొప్పి తగ్గుతుంది.
- ఆముదం గింజలను కచ్చాపచ్చాగా చేసి వాటిని వేడిచేసి లేదా సైంధవ లవణాన్ని వేడి చేసి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెడితే.. చాలా వరకు తగ్గుతుంది.
- నిర్గుణి అనే ఔషధం ఉంటుంది. ఇందులోని తెల్ల వావిలు లేదా నల్ల వావిలను కషాయం కాచి పొద్దున 30 ml, రాత్రి 30 ml తీసుకుంటే సయాటికా నొప్పి తగ్గడానికి బాగా పని చేస్తుంది.
- సహచర అనే ఔషధం ఉంటుంది. దీనిని నూనెలో కాచి నొప్పి ఉన్నచోట అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్లో సహచర తైలం అని దొరుకుతుంది. ఇది వాడినా కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.
- వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి పాలల్లో తేనె కలిపి భోజనం తర్వాత తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల కొంచెం నోరు వెల్లుల్లి వాసన వస్తుంది. కాబట్టి, రాత్రి తాగితే బెటర్ అని డాక్టర్ పెద్ది రమాదేవి సూచిస్తున్నారు.