Amazing Health Benefits of Dance:ప్రస్తుత రోజుల్లో స్కూల్లో ఫంక్షన్, కాలేజ్‌లో పార్టీ, పెళ్లిలో బరాత్, ఇంట్లో చిన్న గెట్ టూ గెదర్, దేవుడి ఊరేగింపులు... ఇలా హ్యాపీ అకేషన్ ఏదైనా డ్యాన్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. సౌండ్ బాక్సులు బద్దలయ్యేలా పాటలు పెట్టుకుని స్టెప్పులు వేస్తేనే ఆ కిక్ వస్తుంది. వయసు, జెండర్తో సంబంధం లేకుండా చిందులేస్తేనేగాని ఆ ఫీల్ ఉండదు. అయితే డ్యాన్స్ వేస్తే కేవలం మనసుకు ఆనందమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటంటే..
శారీరక ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:డ్యాన్స్ ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం అని.. ఇది కేలరీలను బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఒక గంట డ్యాన్స్ చేయడం వల్ల 400 నుంచి 600 కేలరీలు బర్న్ అవుతాయని అంటున్నారు. అయితే ఇది ఆ వ్యక్తి బరువు, డ్యాన్స్ ఇన్‌టెన్సిటీ, డ్యాన్స్ ఫామ్ బట్టి ఆధారపడి ఉంటుందని అంటున్నారు. కేలరీలు ఎక్కువగా ఖర్చయితే.. త్వరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:రోజూ కొంత సమయం డ్యాన్స్ చేస్తే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. రోజూ డ్యాన్స్ చేస్తే హార్ట్ బీట్ స్థిరంగా ఉంటుందని.. గుండె సమస్యలను నివారిస్తుందని తెలుపుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం.. వాకింగ్, ఎక్సర్‌సైజ్ చేసే వారికంటే డ్యాన్స్ చేసే వారికి గుండె ఆరోగ్యం, శ్వాస తీసుకోవడం మెరుగుపడిందని పేర్కొన్నారు. వారానికి 3 నుంచి 4 సార్లు అరగంట కంటే ఎక్కువ సేపు డ్యాన్స్ చేసే వ్యక్తుల స్టామినా, శ్వాస తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని.. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందని అంటున్నారు. అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.
2001లో "ది ప్రివెన్షన్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్" జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. డ్యాన్స్ చేయడం వల్ల గుండె పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, రక్తపోటు గణనీయంగా తగ్గిందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నార్త్ కరోలినాలోని డ్యూక్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లో కార్డియోవాస్కులర్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డా. కార్డిన్ అ. బట్లర్ పాల్గొన్నారు.
కండరాలు బలంగా, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: డ్యాన్స్ అనేది మొత్తం శరీరానికి వ్యాయామం అని.. ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అంటున్నారు.డ్యాన్స్ ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపొరోసిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.