Health Benefits of Horse Gram : రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. శీతగాలులకు శరీర ఉష్ణోగ్రతలో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఫలితంగా రోగనిరోధకశక్తి బలహీనంగా మారి వైరస్లు, బ్యాక్టీరియాలు వేగంగా బాడీలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రమంలోనే శ్వాసనాళాలు బలహీనపడి జలుబు, దగ్గు, జ్వరాలు ప్రబలుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్, న్యూమోనియా వంటి శ్వాస సంబంధిత వ్యాధులు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, చలికాలం వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.
ఈ క్రమంలోనే పోషకాలు పుష్కలంగా ఉండే ఉలవలను డైలీ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా వింటర్లో విజృంభించే శ్వాస సంబంధిత వ్యాధులతో పాటు వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఉలవలలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? వాటిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాల స్టోర్ హౌస్ :పోషకాహార లోపంతో బాధపడే వారు చిరు ధాన్యాల్లో ఒకటైన ఉలవలు క్రమం తప్పక తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, భాస్వరం, పీచుతో పాటు బీ1,బీ2,బీ6, సి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు దీనివల్ల మాంసాహారానికి సమానంగా ప్రొటీన్ కూడా దొరుకుతుంది. కాబట్టి, చలికాలం ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఉలవలను రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు.
తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు!
చలికాలం ఉలవలను తీసుకోవడం ద్వారా అందులోని పోషకాలు బాడీని వెచ్చగా ఉంచడంలో తోడ్పడతాయి. అలాగే, శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి. వీటిలో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ గింజల్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలూ ఎదురుకావంటున్నారు. అంతేకాదు, ఆకలినీ పెంచుతాయి. అధికబరువునీ నియంత్రిస్తాయి.
శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ : చలికాలం వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడంతో చాలా మంది శ్వాస సంబంధిత సమస్యల బారిపడుతుంటారు.కాబట్టి ఈ టైమ్‌లో ఉలవలను డైట్‌లో చేర్చుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు. జలుబు, ఆస్తమా(ఉబ్బసం), బ్రాంకైటిస్, గొంతు ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, అల్సర్ల నుంచి రక్షణ పొందవచ్చంటున్నారు నిపుణులు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా ఉలవలలో ఉండే పోషకాలు ఆయా జబ్బులను ఎదుర్కోవడంలో చాలా బాగా సహాయపడతాయని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.