Pushpa 2 Special Song : దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన తెరకెక్కించే సినిమాల్లో కచ్చితంగా తన మార్క్ కనిపించేలా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. అవి ఫ్యాన్స్‌ను తెగ ఉర్రూతలూగించడంతో పాటు సినిమా సక్సెస్‌లో కీలకంగా వ్యవహరిస్తాయి. అలానే సుక్కు తెరకెక్కించిన పుష్ప మొదటి భాగం సక్సెస్‌లోనూ ఊ అంటావా సాంగ్ కూడా కీలక పాత్ర పోషించిందన్న సంగతి తెలిసిందే. ఈ పాటకు, ఇందులో సమంత వేసిన స్టెప్పులకు, లుక్స్‌కు దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఫిదా అయిపోయారు.
దీంతో పుష్ప 2 కోసం ఆయన ఓ స్పెషల్ సాంగ్ రెడీ చేయబోతున్నారని మొదటి నుంచి ప్రచారం సాగింది. దీంతో ఈ సారి సాంగ్‌లో ఎవరు నటిస్తారనే విషయమై మొదటి నుంచి ఫ్యాన్స్‌లో ఉత్సుకత సాగింది. కానీ ఈ సారి సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలనేది మాత్రం సుక్కుకు ఫైనలైజ్ అవ్వట్లేదు! సినిమా షూటింగ్ ప్రారంభమై ఇంతకాలమైనా, రిలీజ్ డేట్ దగ్గర పడతున్నా ఇంకా దీనిపై క్లారిటీ ఓ కొలిక్కి రావట్లేదు.
వాస్తవానికి మొదట ఈ పుష్ప 2లో స్పెషల్ సాంగ్ సమంతనే చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత సామ్ నో చెప్పిందని ప్రచారం జరిగింది. పుష్పలో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత అందరూ ఆ పాటతోనే తనను గుర్తు పెట్టుకున్నారని, అంతకుముందు తాను చేసిన మంచి సినిమాలను మర్చిపోయారంటూ సమంత కారణం చూపించిందని టాక్. ఒకవేళ రెండో భాగంలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తే తనను ఇలాంటి సాంగ్స్‌తోనే భవిష్యత్‌లో గుర్తుపెట్టుకుంటారని సమంత ఆలోచించి సుకుమార్ కి నో చెప్పిందని ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట.
అయితే సమంత నో చెప్పాక ఆ అవకాశం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానికి వెళ్లిందని కూడా అన్నారు. ఆమె ముందుగా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి ఆ తర్వాత నో చెప్పిందట. అందుకు కారణం ఆమె జూన్ 27న విడుదల కానున్న ప్రభాస్ మూవీ కల్కి 2898 ADలో లీడ్ రోల్ పోషించడం. కల్కితో తెలుగులో కెరీర్ ఊపందుకునే అవకాశం ఉన్న సమయంలో పుష్ప రెండో భాగంలో స్పెషల్ సాంగ్ చేస్తే భవిష్యత్‌లో లీడ్ రోల్స్ రాకపోవచ్చు అనే భయంతో ఆమె వద్దు అందని కొందరు అభిప్రాయపడుతున్నారు.