vijaysethupathiMaharaja Review;
చిత్రం: మహారాజ;
నటీనటులు: విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి తదితరులు;
సంగీతం: అజనీశ్ లోకనాథ్;
ఎడిటింగ్: ఫిల్లోమిన్ రాజ్;
సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్తమన్;
నిర్మాత: సుదర్శన్ సుందరమ్, జగదీశ్ పళనిస్వామి;
రచన, దర్శకత్వం: నిథిలన్ స్వామినాథన్;
కథేంటంటే ? - ఒక ప్రమాదంలో మహారాజ(విజయ్ సేతుపతి) భార్యను పోగొట్టుకుంటాడు. అతడు సినిమాలో బార్బర్. దీంతో అతడు తనకు మిగిలిన ఒకే ఒక తోడు కూతురు జ్యోతిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంట్లో జీవిస్తుంటాడు. అయితే ఓ రోజు మహారాజా ఒంటి నిండా గాయాలతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ముగ్గురు ఆగంతకులు తన ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేశారని ఫిర్యాదు చేస్తాడు. ఈ క్రమంలోనే తన బిడ్డ ప్రాణాలను కాపాడిన లక్ష్మిని ఎత్తుకెళ్లిపోయారని కంప్లైట్ ఇస్తాడు. మరి ఇంతకీ ఆ లక్ష్మి ఎవరు? మహారాజా ఇచ్చిన కంప్లైట్‌ను తీసుకోవడానికి మొదట పోలీసులు ఎందుకు నిరాకరించారు? అసలు మహారాజపై దాడి చేసిన ఆ ముగ్గురు ఎవరు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే? - ఓ భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. కర్మ సిద్ధాంతం అనే పాయింట్‌తో ముడిపడి ఉంటుంది. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపారు. విజయ్ సేతుపతి విలక్షణమైన యాక్టింగ్ హైలైట్. సరదా సరదాగా మొదలై ఊహలకు అందని ట్విస్టులతో ఎమోషనల్‌గా కథ ముగుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వచ్చే ట్విస్టులు, సేతుపతి యాక్షన్ హంగామా సూపర్‌గా ఉంటాయి.
ఫస్ట్ హాఫ్లోఎక్కువ భాగం పాత్రల పరిచయాలే ఉంటాయి. కానీ బోర్ కొట్టిన ఫీల్ కలగదు. మొదట్లో ఒకదానితో మరొకటి సంబంధం లేని వేరువేరు ఎపిసోడ్స్‌లా కనిపించినా ఇంటర్వెల్ సమయానికి అన్నింటి మధ్య ఏదో లింక్ ఉన్నట్లు అర్థమవుతుంది. అందుకు తగ్గట్లుగానే ఓ థ్రిల్లింగ్ సీక్వెన్స్‌తో క్లోజ్ చేసిన ఇంటర్వెల్ సీన్ మెప్పిస్తుంది.
ఇక అనూహ్యమైన మలుపులతో సెకండాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. బిడ్డ విషయంలో మహారాజాకు జరిగిన నష్టం అందర్నీ షాక్‌కు గురిచేసి ప్రతి ఒక్కరి మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్‌లో బాధిత యువతిగా మెయిన్ విలన్‌తో జ్యోతి చెప్పే డైలాగ్స్ స్ఫూర్తి రగిలించేలా ఉంటాయి. ఫైనల్‌గా ఈ కథను ముగింపు తీరు ప్రేక్షకులకు బాగా రక్తి కట్టిస్తుంది.
ఎవరెలా చేశారంటే : విజయ్ సేతుపతి ఎప్పటిలాగే నేచురల్ యాక్టింగ్‌తో కట్టిపడేశాడు. ఆయన నటనే సినిమాకు మెయిన్ హైలైట్. ఆయన పండించే ఎమోషన్స్, ఇనోసెంట్ యాక్టింగ్, చేసే కామెడీ, తన కూతురికి అన్యాయం చేసిన వాళ్లను వెంటాడి చంపే తీరు సేతుపతిలోని నటనా ప్రతిభకు అద్దం పడతాయి. ఆయన కూతురిగా జ్యోతి పాత్రలో సచిన అద్భుతంగా నటించింది. క్లైమాక్స్‌లో ఆమె చెప్పే డైలాగ్స్ చప్పట్లు కొట్టిస్తాయి. మెయిన్ విలన్‌గా సెల్వం పాత్రలో అనురాగ్ కశ్యప్ అదరగొట్టారు. భారతీరాజా, మమతా మోహన్‌దాస్, అరుళ్దాస్, మణికందన్ తదితరుల పాత్రలన్నీ పరిధి మేరకు నటించాయి. దర్శకుడు కథను నడిపించిన తీరు మెప్పించింది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఫిలోమిన్ ఎడిటింగ్ , దినేశ్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరిగా : థ్రిల్ చేస్తారు మహారాజా!
బాలయ్య వచ్చేస్తున్నాడు - NBK 109 షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే?
'రెహమాన్ అడగలేదు - మరి మీరెందుకు అడుగుతున్నారు ఇళయరాజా!?' - Ilayarajas Copyright Issue