Urvashi Rautela Apologizes To Saif :బాలీవుడ్ స్టార్ హీరోసైఫ్ అలీఖాన్ దాడి నేపథ్యంలో నటి ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె సైఫ్‌కు క్షమాపణలు తెలిపారు. ఇన్‌స్టాలో ఆమె పెట్టిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
"సైఫ్ సర్ మీకు ఈ మెసేజ్ చేరుతుందని నేను ఆశిస్తున్నాను. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ప్రవర్తించిన తీరుకు ఎంతో బాధపడుతున్నాను. ఈ విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమల్ని క్షమాపణలు కోరుతున్నాను. ఆ ఇంటర్వ్యూ ఇచ్చే టైమ్‌లో మీపై జరిగిన దాడి తీవ్రత నాకు అంతగా తెలియదు. గత కొన్ని రోజుల నుంచి నేను డాకు మహారాజ్ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నా. దీంతో ఆ సినిమా వల్ల నాకు వచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడాను. ఇలా చేసినందుకు నేను సిగ్గు పడుతున్నాను. మీరు నన్ను క్షమించండి. ఈ దాడి తీవ్రత తెలిశాక నేను చాలా బాధపడ్డాను. ఆ టైమ్‌లో మీ ధైర్యం ఎంతో ప్రశంసనీయం. మీపై నాకు చాలా గౌరవం పెరిగింది" అని ఊర్వశీ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పింది.
ఇదీ జరిగింది :
సైఫ్‌పై జరిగిన దాడి గురంచి ఆయన అభిమానులతో పాటు ఎంతో మంది సెలబ్రీటీలు సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. తను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఆమెను సైఫ్ ఘటనపై స్పందిచమని కోరగా, ఆ సమయంలో ఊర్వశీ తన వజ్రపు ఉంగరాన్ని, వాచీని చూపించి మాట్లాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.