Top Malayalam Movies In OTT :కమర్షియల్ సక్సెస్‌కు దూరంగా చక్కటి కథాంశంతో తెరకెక్కే సినిమా చూడాలనుకునేవారికి టక్కున గుర్తొచ్చేది మలయాళీ సినిమా. థియేటర్లకు ప్రత్యామ్న్యాయంగా ఓటీటీలు వచ్చినప్పటి నుంచి ఈ మలయాళం సినిమాలకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. దానికి కారణం సహజంగా, లోతైన భావోద్వేగాలతో, మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే. ఏ సన్నివేశాన్ని తీసుకున్నా అది బయట సమాజంలో జరుగుతున్నప్పుడు ఎలా కనిపిస్తుందో అదే మాదిరిగా తెరకెక్కిస్తుంటారు. అలాంటి మలయాళీ సినిమాల్లోనూ ది బెస్ట్ ఎవర్గ్రీన్ సినిమాలు మీకోసం.
ద గ్రేట్ ఇండియన్ కిచెన్ (2021) - Prime Video
జియో బేబీ రూపొందించిన మలయాళ డ్రామా ఇది. భారత కుటుంబ వ్యవస్థలో మగాళ్ల ఆధిక్యం స్త్రీలపై ఎలా ఉంటుందనేది చక్కగా వివరించిన సినిమా. కొత్తగా పెళ్లి అయిన యువతి అత్తారింట్లో అడుగుపెట్టి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చక్కగా వివరించిన సినిమా.
దృశ్యం (2013) - Disney + Hotstar
ఒక నేరాన్ని చేసి కూడా కుటుంబమంతా కలిసి అసలు ఆ ఘటనతో తమకేమీ సంబంధం లేదన్నట్లు నమ్మిస్తారు. కథలో పాత్రలనే కాదు చూస్తున్న ప్రేక్షకుడు కూడా ఆ సస్పెన్స్ కు మంత్రముగ్దులవ్వాల్సిందే. సినిమా పూర్తయినా ఆ మిస్టరీ వీడకపోగా సీక్వెల్ కూడా వచ్చింది. దీనిని పలు భాషల్లో రీమేక్ చేసి హిట్లు కూడా కొట్టేశారు.
కుంబళంగి నైట్స్ (2019) - Prime Video
తీర ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం కథ. కుటుంబ సంబంధ బాంధవ్యాల చుట్టూ నడిచే డ్రామా. మనుషుల భావోద్వేగాలు, ఒక కుటుంబంపై సమాజం చూపించే ప్రభావం ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా తెరకెక్కించారు.
జల్లికట్టు (2019) - MX Player
గ్రామీణ సంప్రదాయాలను కళ్లకు కనపడేలా చూపించారు. ఒక కొండ ప్రాంతంలో ఉండే గ్రామంలో తాము పెంచుకునే దున్నపోతు కనిపించకుండా పోతుంది. దానిని వెతికే క్రమంలో ఎటువంటి సామాజిక ఒత్తిడులను ఎదుర్కోవాల్సి వచ్చిందనేది జల్లికట్టు సినిమా కథాంశం.