Rajamouli Mahabharata:రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898 AD' మహాభారతంలోని కురుక్షేత్ర ఘట్టాన్ని టచ్ చేయడం వల్ల మరోసారి 'రాజమౌళి మహాభారతం' ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ వండర్స్ తెరకెక్కించి యావత్ సినీ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న దర్శక ధీరుడు రాజమౌళి. అద్భుతమైన తారాగణంతో, ఆకట్టుకునే కథా కథనంతో అనుకున్నది అనుకున్నట్లుగా చక్కటి సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించగలరని ఆయనకు పేరు.
రాజమౌళి దర్శకత్వంలో మహాభారతం సినిమాను తీస్తే, ఎలా ఉంటుందా అని అంచనాలు వేసేసుకుంటున్నారు ఆయన అభిమానులు. కథకు తగ్గట్టుగా అవసరమైతే గ్రాండ్ సెట్‌లు వేసి, ప్రతి సన్నివేశాన్ని డిటైల్డ్‌గా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దనిదే జక్కన్న ఊరుకోడు. అలా చేస్తూ పోతే అది ఒకటి, రెండూ కాదు మల్టీపుల్ పార్టులుగా తీసినా ఇంకా పూర్తి కాదు. కౌరవులు, పాండవుల మధ్య ఉన్న సంబంధాలు, వారి పుట్టు పూర్వోత్తరాలు, రాజకీయ కక్షలు, ఇరువైపులా ఉన్న మంచీ చెడులు అన్నీ చూపించాలంటే తప్పదు మరి. అలాగే లెజెండరీలైన అర్జునుడు, కర్ణుడు, కృష్ణుడు పాత్రలను దృష్టిలో ఉంచుకుని మహాభారతాన్ని సినిమాగా తీస్తానని గతంలోనే చెప్పడంతో ఇక వారి చుట్టూ తిరిగే కథ సుదీర్ఘంగా ఉంటుందని చెప్పకనే చెప్పొచ్చు.
సినీ ప్రేక్షకులంతా రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తే కురుక్షేత్రంలోని యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టినట్లుగా, సుస్పష్టంగా తెరకెక్కిస్తారని అపారమైన నమ్మకాన్ని కనబరుస్తున్నారు. భారత ఇతిహాసాలను, అందులోని అర్థాన్ని బాగా అర్థం చేసుకున్న జక్కన్నే తీయాలని తెరకెక్కించాలని బలంగా కోరుకుంటున్నారు. అందరూ ఆశించినట్లుగా ఒకవేళ అదే జరిగితే మహాభారతానికి కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోతారు. వాస్తవానికి ఇటీవల కాలంలో అంతటి మహోన్నతమైన బాధ్యతను భుజాలకు ఎత్తుకోగల దర్శకుడు కూడా ఆయనే.