Tollywood Deepavali 2024 Movie Posters : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దీపావళి కళ కనిపిస్తోంది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు బాక్సాఫీస్ ముందుకు వచ్చిన చిత్రాలన్నీ (లక్కీ భాస్కర్, క, అమరన్, భఘీర) పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోన్నాయి. అలానే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవీతో పాటు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, హరీశ్ శంకర్ సహా పలువురు సినీ ప్రముఖులు దీవాళీ శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు పలు నిర్మాణ సంస్థలు కూడా సోషల్ మీడియా వేదికగా తమ కొత్త సినిమా కబుర్లను సినీ ప్రియులతో షేర్ చేసుకున్నాయి. సినిమా పోస్టర్లను షేర్ చేసి, ఆసక్తికర అప్డేట్స్ను ఇచ్చాయి. ప్రస్తుతం అవి మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
త్వరలోనే ఆర్‌సీ 16 -మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. RC 16 వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మించనున్నారు. భిన్నమైన కాన్సెప్ట్‌తో దీనిని తీర్చిదిద్దనున్నారట. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్రబృందం తాజాగా అనౌన్స్ చేసింది.