The Kandahar Hijack Netflix:భారత ప్రభుత్వం నుంచి వ్యతిరేకత, ఒత్తిడి ఎదురవ్వడం వల్ల నెట్‌ఫ్లిక్స్ ఇండియా తన వెబ్ సిరీస్ 'IC 814: ది కాందహార్ హైజాక్'లో మార్పులు చేసింది. వెబ్‌సిరీస్ డిస్క్లైమర్ (Disclaimer) అప్డేట్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ సారథి మోనికా షెర్గిల్ మంగళవారం వెల్లడించారు. హైజాకింగ్ గురించి తెలియని ప్లేక్షకుల కోసం వెబ్‌సిరీస్‌లో హైజాకర్ల కోడ్ నేమ్స్‌తో పాటు అసలు చేర్చినట్లు చెప్పారు.
'1999 హైజాకింగ్ గురించి తెలియని ప్లేక్షకుల క్లారిటీ కోసం డిస్క్లైమర్ అప్డేట్ చేశాం. హైజాకర్ల కోడ్ నేమ్స్తోపాటు వాళ్ల అసలు పేర్లు డిస్క్లైమర్ చేర్చాం. అయితే ఈ సిరీస్‌లో ఉపయోగించిన కోడ్ పేర్లు హైజాకింగ్ సమయంలో ఉపయోగించినవే. భారతదేశానికి గొప్ప స్టోరీ టెల్లింగ్ సంస్కృతి ఉంది. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉండే కంటెంట్‌ను ప్రసారం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం' అని నెట్‌ఫ్లిక్స్ కంటెడ్ హెడ్ మోనికా షెర్గిల్ పేర్కొన్నారు.
ఇదీ వివాదం:
1999 డిసెంబర్ 24న ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC-814 విమానాన్ని పాకిస్థాన్‌కు చెందిన హర్కత్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ హైజాక్ చేసింది. ఖాట్‌మండూ నుంచి దిల్లీ వస్తున్న ఈ విమానాన్ని అందులో ప్రయాణికుల మాదిరిగా నక్కిన ఐదుగురు ముష్కరులు హైజాక్ చేసి అఫ్గానిస్థాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. 2000 సంవత్సరం జనవరి 6న కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అక్తర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సున్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్ అని వెల్లడించింది. అయితే నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లో హైజాకర్లకు హిందూ పేర్లను పెట్టడంపై బీజేపీ నేతలతోపాటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాందహార్ హైజాక్ వెబ్‌సిరీస్‌పై దుమారం రేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.