Suriya About Shifting To Mumbai : తన ఫ్యామిలీతో సహా ముంబయికి షిఫ్ట్ అయిన విషయం గురించి స్టార్ హీరో సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలా తాను మారడం వల్ల ఊహించని మార్పులు వచ్చాయని అన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ కోసం తన సతీమణి జ్యోతిక ఎన్నో వదులుకుందంటూ ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.
"తనకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే జ్యోతిక చెన్నైకు వచ్చింది. మా పెళ్లి అయిన తర్వాత నుంచి కూడా మేము అక్కడే ఉన్నాం. ఆమె నా కోసం అలాగే మా ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ముంబయిలోని తన స్నేహితులతో పాటు కెరీర్‌ను వదులుకుంది. ఈ క్రమంలో తన లైఫ్‌స్టైల్‌ను కూడా మార్చుకుంది. అయితే కొవిడ్ తర్వాత ఆ మార్పు అవసరం అనిపించింది. అందుకే మేమందరం ముంబయి షిఫ్ట్ అయ్యాం. ఇప్పుడు ఆమెకు ఎన్నో కొత్త అవకాశాలు వస్తున్నాయి. డిఫరెంట్ ప్రాజెక్ట్‌ల్లోనూ పనిచేస్తోంది. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నేను గొప్ప డైరెక్టర్లతో పనిచేయాలని అనుకుంటాను. కానీ, తను మాత్రం ఎప్పుడూ కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి వర్క్ చేయాలని అనుకుంటుంది. రీసెంట్గా ఆమె నటించిన 'కాదల్ - ది కోర్', 'శ్రీకాంత్', చిత్రాలు ఎంత వైవిధ్యమైనవో అందరికీ తెలిసిందే. మహిళలకు కూడా పని విషయంలో స్వాతంత్య్రం ఉండాలనేది నా అభిప్రాయం. పురుషుల వలే వారికి కూడా సెలవులు, స్నేహాలు ఎంతో అవసరం. ఇప్పుడు జ్యోతిక తన ఫ్యామిలీతో అలాగే పాత స్నేహితులతో సమయం గడుపుతుంది. ప్రోఫషనల్గానూ బిజీగా ఉంది. నేను ముంబయిలో ఉన్నప్పుడు పనిని పూర్తిగా పక్కన పెట్టేస్తాను. నెలలో 10 రోజులను ఫ్యామిలీ కోసం కేటాయిస్తాను" అని సూర్య అన్నారు.