Sreeleela Classical Dance : శ్రీలీల - తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. వరుస సినిమాలతో ఆడియెన్స్‌ను పలకరిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అసలీ పేరు వినగానే ఏ ప్రేక్షకుడికైనా ముందుగా గుర్తొచ్చేది డ్యాన్స్. అంతలా తన శరీరాన్ని మెలికలు తిప్పుతూ చిందులేస్తుంది. ఈ అమ్మాయి పక్కన డ్యాన్స్ వేయాలి అంటే తాట తెగిపోతుంది స్వయాన సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న మాటలివి. ఇంతకు మించిన కితాబు ఆమెకు మరొకటి ఉండడేమో.
అయితే వెస్ట్రర్న్ డ్యాన్స్‌తో యూత్ మతి పోగొట్టే ఈ ముద్దుగుమ్మలో ఓ క్లాసికల్ డ్యాన్సర్ కూడా ఉంది. అమెరికాలో పుట్టిన ఆమె చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. రీసెంట్గా జరిగిన సమత కుంభ్-2024 వేడుకల్లో శ్రీలీల ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను అలరించింది. గోదాదేవిగా ఆమె అభినయానికి వీక్షకులు ఫిదా అయిపోయారు. దాదాపు 10 నిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా ఫెర్ఫార్మ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా దీనిపై ఓ లుక్కేసేయండి.
ఇకపోతే తన తాజా ప్రదర్శనపై శ్రీలీల ఓ పోస్ట్ పెట్టింది. మీకు తెలుసో లేదో నా చిన్నప్పుడు నుంచే క్లాసికల్ డ్యాన్స్‌తో నా జర్నీ మొదలైంది. మా టీమ్‌తో కలిసి ఆలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి వెళ్తుండేదాన్ని. మా టీమ్‌ను బాల్లెట్స్ అని పిలిచేవారు. అప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే డ్యాన్స్ ఒక హాబీగా మారిపోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ప్రదర్శన చేయడం వైవిధ్యంగా అనిపించినప్పటికీ, ఇప్పటికీ డ్యాన్స్ నాలో ఒక భాగమే. దాదాపు 10-15ఏళ్ల తర్వాత స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వడం ఇదే తొలిసారి. గోదాదేవి అంటే మహిళల్లో రత్నంలాంటిదని అర్థం. ఆమె గాథ ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదర్శన ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. ప్రేమతో శ్రీలీల అని రాసుకొచ్చింది.