Sreeleela Career : ప్రస్తుతం టాలీవుడ్లో సెన్సేషన్ హీరోయిన్గా కొనసాగుతోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. 'పెళ్లి సందD' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సీనియర్ హీరోలతో పాటు యువ కథనాయకులతో కలిసి నటిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. రీసెంట్గా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి 'గుంటూరు కారం' చిత్రంలో నటించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ దక్కినప్పటికీ కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపిస్తోంది.
రెండింటిలోనూ ఒకేలా ఉంటాను : అయితే తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను తెలిపింది. ఓ పాత్ర నుంచి బయటకొచ్చి వెంటనే మరో పాత్రలోకి ప్రవేశించడం ఏమైనా కష్టంగా అనిపిస్తుందా? అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది శ్రీలీల. తాను ఎప్పుడూ అలా ఇబ్బంది పడలేదని వివరించింది. "నేనెప్పుడూ స్విచ్చాన్, స్విచ్చాఫ్ వ్యక్తిలానే ఉంటాను. అదే నా బలం. అందుకే ఒకేరోజు మూడు చిత్రాల్లో మూడు పాత్రలు నటించాల్సి వచ్చినా వెంట వెంటనే ఒక పాత్రలో నుంచి మరో పాత్రలోకి ప్రవేశించగలను. సెట్లో ఉన్నంత సేపు యాక్టింగ్ తప్ప మరో ధ్యాస ఉండదు. ఒకసారి సెట్ నుంచి బయటకు వచ్చానంటే నటిగా నా మైండ్ స్విచ్చాఫ్ అయిపోతుంది. నటన విషయంలోనే కాదు చదువు విషయంలోనూ నా ఆలోచనా ధోరణి అలాగే ఉంటుంది. పుస్తకం పట్టుకుంటే అందరిలాంటి విద్యార్థినైపోతాను. ఇలా ఎక్కడ ఏ పని చేయాలో నాకు ఓ క్లారిటీ ఉంది. అందుకే ఎప్పుడూ ఏది నాకు కష్టంగా అనిపించదు" అని శ్రీలీల చెప్పుకొచ్చింది. డ్యాన్స్ విషయంలో ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు ఏమైనా ఒత్తిడిని కలిగిస్తుంటాయా? అని అడగగా దాన్నెప్పుడూ ఒత్తిడిగా అనుకోనని, బాధ్యతగానే భావిస్తానని చెప్పుకొచ్చింది శ్రీలీల.