Saif Ali Khan Health Update :బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయన వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు. సర్జరీ చేసి వెన్నెముక నుంచి ఓ కత్తిని తొలగించినట్లు ప్రకటించారు. అయితే సైఫ్ ఎడమ చేయి, మెడపై తీవ్రగాయాలు అయ్యాయని డాక్టర్లు వెల్లడించారు.
ఆటోలో ఆస్పత్రికి!
అయితే గాయపడ్డ సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు పలు వార్తలు ప్రచురితమయ్యాయి. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఏ కారు కూడా రెడీగా లేదని, ఇబ్రహీం తన తండ్రిని ఓ ఆటోలో తీసుకువచ్చాడని ఆ వార్తల సారాంశం.
దొంగ దొరికాడుగా!
మరోవైపు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు, చోరీ కోసమే నిందితుడు అక్కడికి వచ్చినట్టు తేలిందని అన్నారు. వెనుక మెట్ల ద్వారా అతడు సైఫ్ ఇంట్లోకి వచ్చాడని పేర్కొన్నారు. అంతకు ముందు ఏడు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, సైఫ్ నివాసానికి చేరుకొని అక్కడ పనిచేస్తోన్న వారందరినీ ప్రశ్నించారు. ఫ్లోర్ పాలిషింగ్ చేసే వ్యక్తులను కూడా విచారించారు.