Rana Daggubati About Prabhas Balakrishna : రీసెంట్గా జరిగిన అవార్డుల వేడుకలో చిత్ర పరిశ్రమలలోని పలువురు నటీ నటులపై రానా, తేజ సజ్జ చేసిన వ్యాఖ్యాలు కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇవన్నీ ముందుగా అనుకున్నవేనని హీరో రానా పేర్కొన్నారు. ఆయన అమెజాన్ వేదికగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో 'ది రానా దగ్గుబాటి షో' నవంబరు 23 తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో, ఈ షోతో పాటు వివిధ విషయాల గురించి రానా మాట్లాడారు.
"రీసెంట్గా జరిగిన అవార్డుల వేడుక సహా ఏ ఈవెంట్ అయినా, ఆ సమయంలో ట్రెండింగ్‌లో ఉన్న వాటిని తీసుకుని, జోక్స్ రెడీ చేస్తాం. రీసెంట్గా మేము వేసిన జోక్స్ ఎవరినీ ఇబ్బంది పెట్టినవి కాదు. సరదాగా మాట్లాడినవే. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నాకు దగ్గరైన వాళ్లే. వాళ్లు కూడా జోక్స్‌ను సరదాగా తీసుకుంటారు" అని రానా అన్నారు.
అందుకే టాక్ షో చేస్తున్నా - "ప్రస్తుతం టాక్ షోలు ఎక్కువ పాపులర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడే పాడ్ కాస్ట్‌లకు కూడా బాగా ఆదరణ పెరిగింది. ఈ నేపథ్యంలో టాక్ షోలకు మంచి స్పందన ఉంటుందని అనుకున్నాం. ఎలాగో ఎప్పటి నుంచో అమెజాన్ ప్రైమ్‌తో కలిసి పని చేయాలని అనుకుంటున్నాం. అందుకే చాలా ఆలోచనల తర్వాత 'టాక్ షో' చేద్దామని ఓ నిర్ణయం తీసుకున్నాం".
"సీజన్ - 1లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల పైనే ఉంటుంది. కొన్ని ఇంకా ఎక్కువ సమయం కూడా ఉంటాయి. షూటింగ్ దగ్గరి నుంచి ఎడిటింగ్ వరకు చాలా విషయాలను దగ్గరుండి చూసుకున్నాం. ప్రభాస్, బాలకృష్ణలను ఈ టాక్ షోకు ఆహ్వానించాలని ఉంది. దీనిపై త్వరలోనే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం" అని రానా చెప్పారు.