Ramoji Rao Introduced Flim Stars: జీవితాంతం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించిన రామోజీరావు 'ఈనాడు' దినపత్రిక ద్వారా వేలమంది పాత్రికేయులను తయారు చేశారు. టీవీ రంగం ద్వారా వేలాది నూతన నటీనటులను బుల్లితెరకు పరిచయం చేశారు. టీవీ ప్రపంచంలో ఆయన చెరగని ముద్రవేశారు. ఆయన నెలకొల్పిన ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్ ఛానళ్లతో బుల్లితెరపై ఒక ట్రెండ్ సెట్ చేయగా.. ఈటీవీ వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలు ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. రామోజీ ఆలోచనల నుంచి పుట్టిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులపై సుమధుర సంగీత జల్లు కురిపించారు.
వందల మంది గాయనీ, గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతోమంది సామాన్యులు రామోజీ ప్రోత్సాహంతో వినోద ప్రపంచంలో రాణించారు. ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా యువ నటీనటులు పరిచయం కాగా తారలుగా ఎదిగిన ఎంతోమంది అగ్రశ్రేణి నటులుగా ఉన్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'పీపుల్ ఎన్‌కౌంటర్' సినిమాతో శ్రీకాంత్ తెలుగు తెరకు పరిచయం కాగా 'నిన్ను చూడాలని' చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా పరిచయమయ్యారు.
మాస్టర్ తరుణ్ అనే పేరును 'మనసు మమత' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేయగా ' నువ్వేకావాలి'తో కథానాయకుడిగా తరుణ్ కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. తెలుగులో ఘనవిజయం సాధించిన 'నువ్వేకావాలి' చిత్రాన్ని హిందీలో 'తుఝే మేమరీ కసమ్' పేరుతో నిర్మించిన చిత్రంతో శ్రియ, జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ తొలిసారిగా వెండితెరపైకి వచ్చారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన 'ఇష్టం'తో తొలిసారిగా తెలుగు తెరపైకి వచ్చిన శ్రియా ప్రస్తుతం అగ్రతారగా వెలుగొందుతున్నారు.