తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాజ‌ధాని ఫైల్స్‌' మూవీ రివ్యూ - ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..?

Rajdhani Files Movie Review : ఇప్పటి రాజకీయ అంశాలతో పాటు వాస్తవాలకు దగ్గరగా తెరకెక్కిన 'రాజధాని ఫైల్స్' మూవీ ఇటీవలే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే ?

Rajdhani Files Movie Review
Rajdhani Files Movie Review

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 12:39 PM IST

Rajdhani Files Movie Review : రివ్యూ : రాజ‌ధాని ఫైల్స్‌, న‌టీన‌టులు: అఖిలన్, వీణ, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్, పవన్, షణ్ముఖ్ , విశాల్, మధు, అజయరత్నం, అంకిత ఠాకూర్, అమృత చౌదరి తదితరులు, సాంకేతిక‌వ‌ర్గం: సంగీతం: మణిశర్మ, ఛాయాగ్ర‌హ‌ణం: రమేష్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వర్రావు, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, గురుచరణ్, వెనిగళ్ల రాంబాబు, సంభాష‌ణ‌లు: అనిల్ అచ్చుగట్ల, క‌ళ‌: గాంధీ, సమర్పణ: హిమబిందు, నిర్మాత: కంఠంనేని రవిశంకర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భాను, సంస్థ‌: తెలుగువ‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌,

రాష్ట్ర భ‌విష్య‌త్తు, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం మూడు పంట‌లు పండే త‌మ పంట పొలాల్ని నిస్వార్థంగా ఇస్తే ఆ రైతుల‌కు క‌న్నీళ్లే ఎదుర‌య్యాయి. ఊళ్లు బాగుప‌డ‌తాయ‌ని భావి త‌రాల భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని క‌ళ్ల ముందు అమ‌రావ‌తి క‌లల సౌధాలు సాకారమ‌వుతుంటే చూడాల‌నుకున్న ఆ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆవిర‌య్యాయి. బిడ్డ‌ని పొదిగే గ‌ర్భంలో గొడ్డ‌లి దించిన క‌ర్క‌శ‌త్వంలా ఒక్క‌రి అహం కోట్ల మంది క‌ల‌ల్ని అలాగే కొన్ని వేల మంది రైతుల జీవితాల్ని నాశనం చేసింది. దీంతో తమకు న్యాయం జరగాలంటూ అమ‌రావ‌తి రైతులు ఉద్య‌మబాట ప‌ట్టారు. న్యాయ‌స్థానాలు మొద‌లుకొని దేవ‌స్థానాల వ‌ర‌కూ వెళ్లి వాళ్ల ఆవేదనను వెళ్లగక్కారు. ఇప్ప‌టికీ జరుగుతున్న ఆ ఉద్య‌మ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈ 'రాజ‌ధాని ఫైల్స్‌' సినిమా తెర‌కెక్కింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందంటే య
క‌థేంటంటే ? :
అరుణ‌ ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌త్తి గుర్తు కె.ఆర్‌.ఎస్ పార్టీ ఎలక్షన్స్​లో గెలిచాక నిర్మాణ ద‌శ‌లో ఉన్న అయిరావ‌తిపై క‌త్తి క‌డుతుంది. ఎవ‌రో క‌న్న‌బిడ్డ‌కి మీరు తండ్రిగా ఉండ‌ట‌మేంటంటూ త‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త చెప్పిన మాటలు విన్న ఆ ముఖ్య‌మంత్రి అధికార వికేంద్రీక‌ర‌ణ పేరుతో నాలుగు రాజ‌ధానులను స్థాపించేందుకు సిద్ధపడతాడు. అపోజిషన్​లో ఉన్నప్పుడు అయిరావ‌తి నిర్ణయాన్ని స‌మ్మతించిన అదే వ్య‌క్తి, అధికారంలోకి రాగానే మాట మార్చ‌డం వల్ల తమ రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళ‌న బాట ప‌డతారు.

అయితే త‌న అధికార బ‌లంతో ఆ ముఖ్యమంత్రి అక్కడ జరుగుతున్న ఆందోళ‌న‌ల‌పై ఉక్కుపాదాన్ని మోపుతాడు. అంతే కాకుండా ఆ ముఖ్య‌మంత్రికి మ‌రో ఇద్ద‌రు ఎంపీలు తోడవ్వడం వల్ల రైతుల వారంతా చేరుకుని ప్రజల మానప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌తారు. దీంతో పోరాటానికి దిగిన ఎంతోమంది ఉద్య‌మకారాలు ప్రాణాలు కోల్పోతారు. అయినా ధైర్యం కోల్పోని రైతులు తమ నిరసనను కొన‌సాగిస్తారు. అయినప్పటికీ ముఖ్య‌మంత్రి దిగిరాక‌పోవ‌డం వల్ల అరుణ‌ప్ర‌దేశ్‌లోని తెలుగు ప్ర‌జ‌లు ఏం చేశారు? ఆ ముఖ్య‌మంత్రికి బుద్ధి చెప్పేందుకు ఆ తర్వాతి ఎన్నిక‌ల్లో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? రైతుల‌కు ప్ర‌తినిధులుగా ఉన్న ఓ కుటుంబం (వినోద్‌కుమార్‌, వాణీ విశ్వ‌నాథ్‌, అఖిల‌న్‌) ఈ ఉద్య‌మంలో ఎలాంటి పాత్ర పోషించింది? ఇటువంటి విష‌యాలు తెలియాలంటే ఇక సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే ? :
రాజ‌ధాని ప‌రిధి వెల‌గ‌గూడెంలోని ఓ ప‌చ్చ‌ని పంట పొలాలు, వాటితో రైతుల‌కు త‌ర‌త‌రాలుగా ఉన్న అనుబంధాన్ని చూపిస్తూ క‌థను మొద‌లుపెట్టారు డైరెక్టర్. రాష్ట్ర అభివృద్ధి, త‌మ ప్రాంత భ‌విష్య‌త్తుని దృష్టిలో ఉంచుకుని ఆ రైతులు రాజ‌ధాని కోసం స్వ‌చ్ఛందంగా భూములు ఇస్తారు. అయితే రాజ‌ధాని నిర్మాణం కోసం ప‌విత్ర జలాల‌తో భూమి పూజ చేయ‌డం నుంచి కథ ఊపందుకుంటుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఎన్నిక‌ల్లో కొత్త ప్ర‌భుత్వం వచ్చాక అక్కడి పరిస్థితులు మారిపోతాయి. త‌న‌ని తాను న‌మ్ముకోని ముఖ్య‌మంత్రి రాష్ట్రంతో సంబంధం లేని త‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త, రౌడీల్లా వ్య‌వ‌హ‌రించే త‌నకు స‌న్నిహిత‌మైన ఓ ఇద్ద‌రు ఎంపీలు మాటలు విని స్వార్థ పూరిత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం. ఇదేంటి అని ప్ర‌శ్నించేవాళ్ల గొంతుల్ని నొక్కేయ‌డం వంటి ప‌రిణామాలు వాస్త‌వ ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కు క‌డతాయి.

భూములిచ్చిన కర్షకులు శాంతియుత పోరాటంపై త‌న అధికార బ‌లాన్ని చూపించే తీరు, ఆ క్ర‌మంలో మ‌హిళ‌లంతా మ‌రింత చైత‌న్య‌వంత‌మై అక్కడి ఉద్య‌మంలో అలుపెర‌గ‌కుండా పోరాటం చేసే క్ర‌మం సినిమాలో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. త‌మ ఆక్రంద‌న‌ని పాల‌కులు ప‌ట్టించుకోక‌పోవ‌డం, ఆఖ‌రికి తమ గ‌ళాన్ని కూడా బ‌య‌టకు వినిపించకుండా వారిని అడ్డుకునే తీరు, దాంతో రైతులు ఉద్య‌మంలో ప్రాణాల్ని కోల్పోవ‌డం వంటి స‌న్నివేశాలు హృద‌యాల్ని మెలిపెడ‌తాయి.

తెర‌పై క‌నిపించే ప్ర‌తీ పాత్ర‌, ప్ర‌తీ సీన్​కి ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవుతాడు. రైతుల ఆవేద‌న‌లో ఎంత నిజాయ‌తీ ఉందో మ‌రింత బాగా అర్థ‌మ‌య్యేలా డైరెక్టర్ ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు. సెకెండాఫ్​లో మ‌రో ద‌ఫా ఓట్లు దండుకుని అధికారాన్నిచేజిక్కించుకోవ‌డం కోసం రాజ‌ధాని ప్రాంత భూముల్ని పేద‌ల‌కి పంచేందుకు ఎత్తుగ‌డ వేయ‌డం, అయిరావ‌తి రైతుల ఉద్య‌మాన్ని నీరుగార్చ‌డం వంటి స‌న్నివేశాలు కీల‌కం.

క‌ష్ట‌ప‌డ‌మ‌ని చెబితే ఎవ‌డైనా ఇష్ట‌ప‌డ‌తాడా, వాడికి సుఖాన్ని నేర్పి ప‌డుకోబెట్టాలి అంటూ అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టి సీఎం వేసే ప‌థ‌కాల ఎత్తుగ‌డ‌, ప్ర‌జ‌ల్ని చైత‌న్యవంతం చేస్తార‌నే భ‌యంతో ఉపాధ్యాయుల్ని ప‌క్క‌న‌పెట్టాల‌ని నిర్ణ‌యించుకునే తీరు ఇవ‌న్నీ ప్రేక్ష‌కులను ఆలోచింపజేస్తాయి. ఓటరు త‌మ ఓటు హ‌క్కుని వినియోగించుకుంటూనే తీసుకున్న స్ఫూర్తిదాయ‌క‌మైన నిర్ణ‌యం ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. గొడ్డ‌లితో వేటు వేసి గుండెపోటు వ‌చ్చిందని ప్ర‌చారం చేయండంటూ ముఖ్య‌మంత్రి చెప్ప‌డంతో సినిమా ముగుస్తుంది. ఓ సామాన్యుడు అసెంబ్లీలోకి వెళ్లి మాట్లాడ‌టం, ముఖ్య‌మంత్రే త‌మ ద‌గ్గ‌రికి వ‌చ్చేలా చేయ‌డం వంటి ఫిక్ష‌నైజ్డ్‌గా స‌న్నివేశాలు ఎక్కువ సినిమాటిక్ లిబ‌ర్టీని తీసుకుని తెరకెక్కించిన‌ట్టుగా అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే ? :
ఈ సినిమాలో పాత్ర‌లే త‌ప్ప న‌టులు మీకు అస్సలు క‌నిపించ‌రు. రైతు ప్ర‌తినిధులుగా, దంప‌తులుగా వినోద్‌కుమార్‌, వాణీ విశ్వ‌నాథ్ చ‌క్క‌టి అభిన‌యాన్ని చూపించారు. వారి త‌న‌యుడుగా అఖిలన్ కనిపించారు. ఏఐ టెక్నాల‌జీలో ఉన్న‌త చ‌దువులు చ‌దివిన ఇంజినీర్‌గా అత‌ని పాత్ర, న‌ట‌న ద్వితీయార్థానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. రాజ‌ధాని కోసం భూములిచ్చిన ప‌లువురు రైతులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ముఖ్య‌మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా క‌నిపించిన న‌టులు నిజ జీవిత వ్య‌క్తుల్ని గుర్తు చేస్తూ ఆ పాత్ర‌ల్లో బాగా యాక్ట్ చేశారు.

సాంకేతిక విభాగాలు మంచి ప‌నితీరు క‌న‌బ‌రిచాయి. కెమెరా, సంగీతం, కూర్పు అన్నీ బాగా కుదిరాయి. మాట‌లు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచాయి. ఒడిలో పిల్ల‌ల్ని జో కొట్టే మ‌హిళ‌, ఉద్య‌మంలోకి వ‌చ్చి జై కొట్టిందంటే ప్ర‌ళ‌య‌మే, మ‌న పంట‌కి నీరు ఎంత అవ‌స‌ర‌మో రాష్ట్రానికి రాజ‌ధాని అంతే అవ‌స‌రం, దేశానికే అన్నం పెట్టిన అన్న‌పూర్ణ అరుణ‌ప్ర‌దేశ్ భ‌వ‌తీ భిక్షాందేహి అంటూ క‌నిపించిన అంద‌రినీ అప్పులు అడుక్కునే స్థాయికి దిగ‌జారిపోయింది. త‌దిత‌ర సంభాష‌ణ‌లు సినిమాకు

ఎంతో బ‌లాన్నిచ్చాయి. డైరెక్టర్ భాను వాస్త‌వ సంఘ‌ట‌న‌ల్ని డాక్యుమెంట‌రీలా కాకుండా, దానికి వాణిజ్యాంశాల్ని జోడించి తెర‌పైకి తీసుకొచ్చిన తీరు ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగానే ఉంది.

బ‌లాలు

  • వాస్త‌వ నేప‌థ్యం
  • భావోద్వేగాలు
  • మాట‌లు.. న‌టీన‌టులు
  • ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

  • ఆరంభ స‌న్నివేశాలు

చివ‌రిగా: రాజ‌ధాని ఫైల్స్... రాజ‌ధాని రైతుల పోరాట స్ఫూర్తి గాథ

ABOUT THE AUTHOR

...view details