Rahat Fateh Ali Khan Latest Video :ప్రముఖ బాలీవుడ్ సింగర్ రాహత్ ఫతేహ్ అలీ ఖాన్ తాజాగా తన శిష్యుణ్ని చెప్పుతో కొడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై రాహత్ క్లారిటీ ఇచ్చారు. అందులో ఉన్నది ఆయనే అని ఫతేహ్ అలీ ఖాన్ ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఆయన తన శిష్యుడికి క్షమాపణలు చెప్పారు.
ఇంతకీ ఏం జరిగిందంటే ?
ఓ బాటిల్ కనిపించకపోయిన విషయంలో తన శిష్యుడిపై రాహత్ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో తనని వదిలేయాలంటూ బాధితుడు రాహత్ను బ్రతిమలాడుతుంటడం ఆ వీడియోలో గమనించొచ్చు. అయితే సహనం కోల్పోయిన అలీ ఖాన్‌ను ఇతర సిబ్బంది నిలువరించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది.
అయితే అప్పటికే దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో తాజాగా దానికి వివరణ ఇస్తూ అలీ ఖాన్ మరో వీడియోను నెట్టింట విడుదల చేశారు. ఇది గురు, శిష్యుల మధ్య విషయమంటూ ఆయన వ్యాఖ్యానించారు. బాధితుడు తన సొంత శిష్యుడేననంటూ చెప్పుకొచ్చిన రాహత్, అతడు తన కుమారుడిలాంటి వాడని చెప్పుకొచ్చారు. శిష్యుడు తప్పు చేస్తే గురువు దండించినట్లుగానే దీన్ని భావించాలని అన్నారు. ఒకవేళ అతడు మంచి చేస్తే ప్రేమ కురిపిస్తానని, తప్పు చేస్తే శిక్షిస్తానని అన్నారు. బాధితుడికి తర్వాత క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు.