Producer Soundarya Jagadish Passed Away : కన్నడ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త సౌందర్య జగదీశ్ బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు జగదీశ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
నిర్మాత జగదీశ్ మృతిని ఆయన స్నేహితుడు శ్రేయస్ ధ్రువీకరించారు. ''సౌందర్య జగదీశ్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ఆయనను ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు లేవు. పోలీసులకు సమాచారం అందించాం. శవపరీక్షలు జరిగాక ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయి" అని శ్రేయస్ తెలిపారు.
నిర్మాత సౌందర్య జగదీశ్ (పాత చిత్రం) 'గుండెపోటు కాదు- సూసైడే!'
సౌందర్య జగదీశ్ మృతిపై బెంగళూరు నార్త్ డివిజన్ డీసీపీ సైదులు అదావత్ మీడియాతో మాట్లాడారు. "నిర్మాత సూసైడ్‌పై మాకు ఆదివారం ఉదయం 9.45 గంటలకు సమచారం అందింది. సౌందర్య జగదీశ్ భార్య ఫిర్యాదు చేశారు. జగదీశ్ గుండెపోటుతో చనిపోలేదని, ఆత్మహత్యేనని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్నిరోజులుగా జగదీశ్ మానసికంగా బాధపడుతున్నట్లు తెలిసింది. ఆయన మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం" అని డీసీపీ తెలిపారు.
రెండు వారాల క్రితమే!
మస్త్ మజా మాది, స్నేహితారు వంటి పలు చిత్రాలను నిర్మించారు జగదీశ్. అప్పు- పప్పు చిత్రం ద్వారా తన కుమారుడు నీషేక్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిర్మాతగానే కాకుండా చిత్రసీమలో పలు విభాగాల్లో కూడా పనిచేశారు. సౌందర్య జగదీశ్ సెక్యూరిటీ గార్డ్ గత నెలలో మరణించగా, ఆయన అత్త రెండు వారాల క్రితం చనిపోయారు.
రజనీకాంత్ టాప్ ప్రొడ్యూసర్ కన్నుమూత
ఇటీవల కోలీవుడ్ సీనియర్ నిర్మాత ఆర్ఎం వీరప్పన్ కొంత కాలంగా వృద్దాప్యానికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆర్ఎం వీరప్పన్ 1964లో ఎంజీఆర్ హీరోగా నటించిన దైవ తాయి అనే సినిమాతో రైటర్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో సినిమాలకు రచయితగా, నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా రజినీకాంత్‌ను సూపర్ స్టార్‌గా మార్చిన బాషా చిత్రాన్ని కూడా ఆర్ఎం వీరప్పనే నిర్మించారు. కమల్ హాసన్‌తో కూడా ఎన్నో చిత్రాలను తీశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంత్రిగానూ పని చేశారు.