Prithviraj Sukumaran About Prabhas : రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా అభిమానుల మనసు గెలుచుకున్న స్టార్ హీరో ప్రభాస్. ఆయనతో కలిసి పని చేసిన నటులు కూడా ఇదే విషయం చెబుతుంటారు. మూవీ షూటింగ్ లొకేషన్‌లో ప్రభాస్ ఇచ్చే మర్యాద, ఆతిథ్యం చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. 'సలార్'లో ప్రభాస్‌తో కలిసి నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా రెబల్ స్టార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకొన్నారు.
సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్ ప్రమోషన్ సమయంలో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళితో కలిసి ఓ చిట్‌చాట్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందులో రాజమౌళి పృథవీరాజ్‌ని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అదేంటంటే, 'ప్రభాస్‌తో కలిసి పని చేయడంలో ఇబ్బంది పెట్టే అంశం ఏంటి?' దీనికి పృథ్వీరాజ్ ఏం చెప్పారంటే?
ప్రభాస్‌తో అలా చెబితే కష్టం!
రాజమౌళి ప్రశ్నకు పృథ్వీరాజ్ ఫన్నీగా స్పందించారు. "మీరు ప్రభాస్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అది నచ్చింది, నాకు ఇది నచ్చింది అని పొరపాటున కూడా అనకూడదు. నేను దేశంలో చాలా ప్రాంతాలు తిరుగుతూ షూటింగ్‌లో పాల్గొంటున్నాను. ఇంటికి వెళ్లి నా కార్లు నడిపి చాలా కాలమైందని ప్రభాస్‌తో అన్నాను. వెంటనే ప్రభాస్ నా లంబోర్ఘినిని ఇక్కడే ఉంచి వెళ్తాను. కొన్ని రోజులు వాడుకోండని చెప్పారు. నేను మనసులో ఆర్ యూ మ్యాడ్ అనుకున్నాను. ప్రభాస్ ఓ డేంజరస్ పర్సన్ సర్" అని రాజమౌళికి చెప్పారు.