Tollywood Star Heros: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన టాలీవుడ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాల గురించి చర్చించారు. బాక్సాఫీస్ వసూళ్ల ద్వారా పెద్ద స్టార్ ఎవరో నిర్ణయించడం కష్టం అని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, ప్రభాస్ గురించి మాట్లాడారు.
బన్నీ, ప్రభాస్, పవన్ కల్యాణ్‌లో ఎవరు పెద్ద స్టార్? ప్రొడ్యూసర్ ఆన్సర్ ఇదే! - Tollywood Star Heros - TOLLYWOOD STAR HEROS
Tollywood Star Heros : తెలుగు హీరోల్లో అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, ప్రభాస్ ఎవరు పెద్ద స్టార్ అనేది నిర్ణయించడం కష్టమన్నారు నిర్మాత సురేశ్ బాబు.
Published : Oct 4, 2024, 10:38 AM IST
'పెద్ద హీరో ఎవరు అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరు హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా కలెక్షన్లు డైరెక్టర్‌పై కూడా ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో అలరించలేకపోవచ్చు. అందుకే కలెక్షన్ల ఆధారంగా ఎనరు పెద్ద అని నిర్ణయించలేం. తెలుగులో పవన్‌కల్యాణ్ సినిమాకు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో వస్తాయి. ప్రభాస్‌కు కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయి. అల్లు అర్జున్ తొలి రోజు మంచి వసూళ్లు సొంతం చేసుకోగలరు. ప్రస్తుతం దేశంలో ప్రభాస్ పెద్ద హీరో అని చెప్పలేం. 'బాహుబలి', 'కల్కి'కి మధ్యలో అతడు నటించిన కొన్ని సినిమాలు అంచనాలను అందుకోలేదు. ఆంధ్రాలో పవన్ కల్యాణ్‌కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. పవన్‌కల్యాణ్ ఇప్పుడు చిన్న డైరెక్టర్‌తో సినిమా తీసినా తొలి రోజు భారీ కలెక్షన్లు వస్తాయి. ఒకవేళ పెద్ద దర్శకుడితో తీస్తే ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఎందుకంటే గతంలో ఆయన తీసిన 'జానీ' అంచనాలను అందుకోలేదు. ఇదే చర్చ కోలీవుడ్‌లోనూ ఉంటుంది. అజిత్, విజయ్, రజనీకాంత్‌లలో పెద్ద హీరో ఎవరంటే చెప్పలేం. ప్రేక్షకులకు నచ్చిన సినిమాలు చేస్తే వారు కచ్చితంగా ఆదరిస్తారు. తెలుగులో రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించే హీరోలు చాలామందే ఉన్నారు' అని సురేశ్ బాబు చెప్పారు.
వాళ్లు ఆపేసినంత మాత్రాన ఇండస్ట్రీ ఆగదు
ఇక ఇదే ఇంటర్వ్యూలో తమిళ చిత్ర పరిశ్రమ గురించి కూడా మాట్లాడారు. విజయ్, అజిత్ సినిమాలు ఆపేస్తే తమిళ పరిశ్రమ భవిష్యత్తుపై స్పందించారు. 'కొందరు సూపర్‌స్టార్‌లు సినిమాలు మానేసినంత మాత్రాన ఇండస్ట్రీపై ప్రభావం పడుతుందనుకోకూడదు. వాళ్ల తర్వాత కొత్త వాళ్లు స్టార్లుగా ఎదుగుతారు. సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణించినప్పుడు సంగీత ప్రపంచం ఏమవుతుందా అని అందరూ అనుకున్నారు. అది ఆగలేదు కదా. అలానే ఇక్కడ కూడా స్టార్ హీరోలు సినిమాలు ఆపేస్తే, లోకల్ హీరోలే స్టార్‌లుగా మారతారు' అని అన్నారు.