Oscars 2024 Nominees Bumber Offer : ఆస్కార్ అవార్డ్స్ - 2024 మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 11న తెల్లవారుఝామున 4 గంటలకు మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ నామినీలకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్న 20మందికి అత్యంత విలువైన గిఫ్ట్ ప్యాక్‌ను ఇవ్వబోతున్నారని తెలిసింది. సాధారణంగా ప్రతి ఏటా ఏదో ఒక వైవిధ్యమైన బహుమతిని వాళ్లకు ఇస్తుంటారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు ఓ బంపర్ ఆఫర్‌ను అందుకోనున్నారు.
అదేంటంటే వాళ్లకు ఇవ్వబోయే ఒక్కో బ్యాగ్ విలువ రూ.1.4 కోట్లు ఉందని సమాచారం అందింది. సుమారు 50 బహుమతులు ఈ బ్యాగ్‌లో ఉంటాయట. రూ.1200 విలువ చేసే రూబిక్ క్యూబ్ దగ్గరి నుంచి మొదలై అత్యంత ఖరీదైన స్కీ చాలెట్ వరకు ఉంటాయట.
- స్కీ చాలెంట్ అంటే స్విట్జర్లాండ్‌లో ప్రకృతి అందాల మధ్య సకల సదుపాయాలు కలిగి ఉండే వసతి సముదాయం. ఇందులో మూడు రాత్రులు ఉండే అవకాశాన్ని కల్పించనున్నారట. అంతేకాదు విలువైన బంపర్ ఆఫర్‌ను దక్కించుకున్న వాళ్లు తమతో పాటు మరో 9 మంది అతిథులను కూడా స్కీ చాలెట్‌కు తీసుకెళ్లొచని తెలిసింది. ఈ మూడు రాత్రుల కోసం రూ.41 లక్షలు చెల్లించనున్నారు.
- ఇంకా సౌత్ కాలిఫోర్నియాలోని గోల్డెన్ డోర్ స్పాలో ఏడు రోజులు గడిపే అవకాశాన్ని కల్పిస్తారు. దీని విలువ రూ.19 లక్షలు. ఇక్కడ మసాజ్, ఫామ్ టేబుల్ మీల్స్, ధ్యానం, ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అదనపు తరగతులకు కూడా హాజరుకావచ్చు.
- చర్మ సౌందర్యాన్ని పెంచి, వృద్ధాప్య ఛాయలను తగ్గించే మైక్రో నీడిలింగ్ ట్రీట్మెంట్ ప్యాకేజీని ఇవ్వనున్నారు. దీని కోసం రూ.8.2లక్షలు ఇస్తారు. అమెరికాలోని మసాచూసెట్స్‌లో ఉన్న సైనోష్యూర్‌లో దీని చికిత్స తీసుకోవచ్చు.
- కెనడాలో చేతివృత్తి కళాకారులు తయారు చేసే ఖరీదైన ఎల్బోక్ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వనున్నారు . దీని విలువ రూ.27వేలు. ఇంకా రూ.లక్ష విలువైన పోర్టబుల్ ష్వాంక్ గ్రిల్ కూడా అందజేయనున్నారు.
- మానసిక వైద్య నిపుణుడు కార్ల్ క్రిస్ట్‌మెన్ లైవ్ షో (రూ.20లక్షలు). మియాజ్ స్కిన్ కేర్ నుంచి రూ.42 వేల గిఫ్ట్ సెట్.
- లాస్ ఏంజిల్స్‌కు చెందిన మార్కెట్ కంపెనీ డిసెంటివ్ అసెట్స్ గత 22 ఏళ్లుగా ఆస్కార్ నామినీలకు బహుమతులను అందిస్తూ వస్తోంది. అలాగే ఈ ఏడాది అత్యంత విలువైనవి ఇచ్చేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఆస్కార్ అకాడమీతో ఈ కంపెనీకి ఎలాంటి ఒప్పందం లేదు. అయినా కూడా నామినీలకు అందించడం గమనార్హం. వారిని మరింత ప్రోత్సాహించేందుకే ఇలా చేస్తోంది.