Most Watched Indian Web series :ఓవైపు బాక్సాఫీస్ వద్ద వినోదాల జోరు కొనసాగుతున్నా మరోవైపు ఓటీటీలోనూ అదే స్థాయిలో వరుసగా సినిమా, సిరీస్‌లు రిలీజ్ అవుతూ నాన్ స్టాప్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఎందుకంటే సినిమా అభిమానులు, వెబ్ సిరీస్ లవర్స్ అభిరుచికి తగ్గట్టుగా కంటెంట్లను తీసుకొస్తున్నాయి పలు ఓటీటీ సంస్థలు. టాలీవుడ్ టు బాలీవుడ్ - అగ్రస్థాయి నటులతో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలతో పాటు చిన్న నటులతో రూపొందుతున్న ప్రాజెక్ట్‌లు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కంటెంట్ ఉండాలే కానీ నటుల ఇమేజ్‌తో సంబంధం లేకుండా ఆకట్టుకుంటున్నాయి. అలా పెద్ద పెద్ద స్టార్లు లేకుండా తక్కువ పెట్టుబడితో రూపొంది హీరామండీ, ఇండియన్ పోలీస్ ఫోర్స్ వంటి టాప్ షోల కన్నా ఎక్కువ వీక్షకులను పొందింది రికార్డు సృష్టించింది ఓ వెబ్ సిరీస్.
అదేంటంటే? - ఆర్మాక్స్ మీడియా ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం 2024 మొదటి ఆరు నెలల్లో ఓటీటీలో అత్యధికంగా వీక్షించిన భారతీయ సిరీస్‌గా "పంచాయత్" నిలిచింది. మే 28, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ మూడో సీజన్ ఇప్పటి వరకూ 28.2 మిలియన్ల వీక్షకులను దక్కించుకుంది. తద్వారా ఇప్పటివరకూ అత్యధిక వ్యూస్ దక్కించుకున్న హీరామండి సిరీస్‌ను రెండో స్థానంలోకి నెట్టింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న హీరామండీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. భారతీయ వెబ్సిరీస్లోనే ఇది అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులతో రూ.250కోట్లకు పైగా పెట్టుబడితో దీన్ని చిత్రీకరించారు. ఇది ఇప్పటివరకు 20.3 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.