Junior Artist Acted With Big Heroes: అతడు ఓ మంచి నటుడు, నిర్మాత, నేపథ్య గాయకుడు కూడా. ఇవన్నీ రాత్రికి రాత్రి సాధించినవి మాత్రం కాదు. వీటన్నింటిలో ఎదగడానికి ఆయన ఎన్నో కష్టాలను, ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. 2018లో విడుదలైన 'జోసెఫ్' చిత్రంలో ఇతడి నటన అందరినీ మెచ్చుకునేలా చేసింది. అతడెవరో ఇప్పటికే మీకు అర్థమయ్యిందా? మనం చెప్పుకుంటుంది జోజు జార్జ్ గురించే.
కేరళకు చెందిన జోజు జార్జ్ అసలు జోసెఫ్ జార్జ్. కుజూర్లో స్కూలింగ్ చదివిన ఇతడు ఇరింజలకుడలో డిగ్రీ పట్టభద్రుడయ్యాడు. 1995లో 'మజవిల్కూదరం' అనే సినిమాతో జూనియర్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన జోజు తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత అంటే 2000 ఏడాది నుంచీ మలయాళ చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించడం మొదలు పెట్టాడు. 2010నాటికి జార్జ్‌కు యాక్షన్ హీరో బిజు, టేక్ ఆఫ్, త్రివేండ్రం లాడ్జ్ వంటి పెద్ద సినిమాల్లో కీలకమైన పాత్రలు రావడం మొదలయ్యాయి.
ఇదిలా ఉండగా 2015లో నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన జోజు 'చార్లీ' వంటి సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. అప్పట్లో 'చార్లీ' సినిమా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను కైవసం చేసుకుంది. తర్వాత 'అప్పు పాతు పప్పు ప్రొడక్షన్స్' పేరుతో జార్జ్ ప్రొడక్షన్ కంపెనీని కూడా ప్రారంభించాడు.