Mechanic Rocky Review :మాస్ కా దాస్విష్వక్‌సేన్ లీడ్ రోల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ 'మెకానిక్ రాకీ'. ట్రైలర్, టీజర్ అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం తాజాగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? విష్వక్‌సేన్ ఖాతాలో హిట్ పడిందా లేదా?
కథేంటంటే :
నగుమోము రాకేశ్ అలియాస్ రాకీ (విష్వక్‌సేన్) బీటెక్ మధ్యలోనే నిలిపేసిన ఓ యువకుడు. తండ్రి రామకృష్ణ (నరేశ్ వీకే) నడుపుతున్న ఓ గ్యారేజీలో మెకానిక్‌గా సెటిలైపోతాడు. గ్యారేజ్‌లో రిపేర్లు చేయడంతో పాటు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. అయితే రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ (శ్రద్ధా శ్రీనాథ్), ప్రియ (మీనాక్షి చౌదరి) వస్తారు. రాకీ కాలేజీలో చదువుకునే సమయంలో తన మనసుకు దగ్గరైన అమ్మాయే ప్రియ. తన ఫ్రెండ్ చెల్లెలు కూడా. వీళ్లిద్దరి మధ్య లవ్‌ట్రాక్ స్టార్ట్ అనుకునేలోపు కొన్ని కారణాల వల్ల కాలేజీ డ్రాప్ అవ్వాల్సి వచ్చింది రాకీ. అయితే డ్రైవింగ్ స్కూల్ కారణంగా చాలా రోజుల తర్వాత మళ్లీ కలిసిన ప్రియ గురించి రాకీకి తెలిసిన కొత్త విషయాలేమిటి? మరి ఆ విషయాలు తెలుసుకుని ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? వాళ్లిద్దరి జీవితాల్లోకి వచ్చిన మాయ వారి ఎలా ప్రభావితం చేసింది? ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే :
అయితే ఈ స్టోరీ వింటుంటే ఇదేదో ట్రైయాంగిల్ లవ్‌స్టోరీలా ఉందనే అంచనాకి వచ్చేస్తాం. ప్రారంభ సన్నివేశాలు కూడా రొమాంటిక్ కామెడీ సినిమానే తలపిస్తాయి. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జానర్ మారిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఇంకేదో ఉందనే అనుమానాల్ని రేకెత్తించి, సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. కమర్షియల్ హంగుల డోస్ కాస్త ఉండటం వల్ల ఇది కమర్షియల్ సినిమా అనిపిస్తుంది. కానీ, వాస్తవానికి ఇది ఓ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే కథ. ఫక్తు థ్రిల్లర్ సినిమాకి అవసరమైన కంటెంట్ ఉన్న కథ ఇది. ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం ఇందులో ఉంది.
అయితే చాలావరకు సీరియస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఓ మైనస్. దాని కారణంగా కథలో గాఢత కొరవడినట్లు అనిపిస్తుంది. కామెడీ సీన్స్, పాటల మధ్య ఫస్ట్ హాఫ్ కథే ముందుకు కదలదు. దీంతో పాత్రలు నడుచుకునే విధానం మొదలుకుని కథలోని ట్విస్ట్‌ల వరకూ ఏవీ నేచురల్‌గా అనిపించవు. దాంతో ప్రేక్షకుడు కథలో అంతగా లీనం కాలేడు. కామెడీ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. విష్వక్ సేన్ ఓల్డ్ గెటప్‌లో కనిపించి చేసిన హంగామా కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
సెకెండాఫే ఈ సినిమాకి ప్రధానబలం. అనూహ్యమైన మలుపులు సినిమాను ఆసక్తిరేపేలా చేస్తాయి. ప్రతి పాత్ర కూడా ఓ కొత్త ట్విస్ట్‌కు నాంది పలకడం వల్ల అప్పటిదాకా సాగిన కథకి బలం చేకూరుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ప్రేక్షకుడి నిట్టూర్పులకి సెకెండాఫ్ జోష్‌నిస్తుంది. మధ్య తరగతి ఆశ, అవసరాల్ని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే మోసాల నేపథ్యాన్ని ఈ సినిమాలో స్పృశించారు. కథనంతో కట్టిపడేయాలనే ప్రయత్నం ఎక్కువగా కనిపించింది. అయితే, భావోద్వేగ కోణాన్ని డైరెక్టర్ మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. కొన్ని ట్విస్ట్‌లు మాత్రం థ్రిల్‌ని పంచుతాయి.
ఎవరెలా చేశారంటే :
విష్వక్‌సేన్ ఇప్పటికే తనకు అలవాటైన పాత్రలో కనిపించారు. హుషారైన నటనతో తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరిలకు చాలా బలమైన పాత్రలు దక్కాయి. వాళ్ల పాత్రల్లో నటనకూ ప్రాధాన్యం కూడా ఉంది. ముఖ్యంగా శ్రద్ధా శ్రీనాథ్ పాత్ర ప్రేక్షకులకు ఓ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హర్షవర్ధన్, నరేశ్, సునీల్, రోడీస్ రఘు, హర్ష చెముడు తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.
సాంకేతికంగానూ ఈ సినిమా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధానబలం. కెమెరా విభాగం లోటేమీ చేయలేదు. ఎడిటింగ్ టీమ్ ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌పై కాస్త ఫోకస్ పెట్టాల్సింది. డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి ఎంచుకున్ కథా నేపథ్యం, ఆయన కథన రచన ప్రేక్షకులను మెప్పిస్తుంది. మాటలు కూడా అక్కడక్కడా బాగా నవ్వించాయి. ఎమోషనల్ యాంగిల్‌ను కాస్త జోడించే ఉంటే బాగుండేది. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
బలాలు