Manchu Vishnu Maa President:తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Maa Association) లో కీలం పరిణామం జరిగింది. స్టార్ హీరో మంచు విష్ణు మరోసారి 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనను అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్ నూతన భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా కొనసాగాలని సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ క్రమంలో మా భవనం విజయవంతంగా పూర్తయ్యే వరకు మంచు విష్ణు నేతృత్వంలోని ప్రస్తుత కమిటీ పదవీకాలాన్ని పొడిగించాలని సభ్యులు ప్రతిపాదించారు. దీంతో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ 'మా' అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది.
ఇక సభ్యుల తీర్మానంపై హీరో విష్ణు హర్షం వ్యక్తం చేశారు. మా సభ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం తనవంతు ప్రయత్నాలను మరింత రెట్టింపు చేస్తానని విష్ణు తెలిపారు. తన నాయకత్వాన్ని కొనసాగించడం ద్వారా అసోసియేషన్ బలోపేతానికి సభ్యులు మరింత తోడ్పాటును అందించారని మంచు విష్ణు ఈ సందర్భంగా పేర్కొన్నారు.