Kiran Abbavaram KA Movie Success :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా 'క' (KA) సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మూవీటీమ్ హైదరాబాద్లో థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో హీరో కిరణ్ అబ్బవరం సహా, పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో హీరో కిరణ్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమోషనల్గా మాట్లాడడంపై కూడా క్లారిటీ ఇచ్చారు.
'మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంతటి ఘన విజయాన్ని నేను ఊహించలేదు. ప్రేక్షకులు నన్ను తమ సొంత వ్యక్తిగాలాగా భావిస్తున్నారు. మేము నాలుగు ప్రీమియర్సే అనుకున్నాం. కానీ ఆడియెన్స్ కోరిక మేరకు భారీ సంఖ్యలో ప్రీమియర్స్ షోలు పెంచాం. 82 చోట్ల హౌస్‌ఫుల్ బోర్డు పెట్టారు. ఇక ప్రీ రిలీజ్ రోజు ఎవరినో ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయలేదు. మా అమ్మ కష్టం గురించి చెప్పాలనుకున్నాను. ఏడాది కాలంగా ఎన్నో మాటలు పడ్డాను. ఆ బాధతోనే అలా మాట్లాడాను. అంతేకాని ఎవరినీ తక్కువ చేయాలి అని మాట్లాడలేదు. బాధను షేర్ చేసుకోవాలనున్నా అంతే' అని అన్నారు.
చెన్నైలో షోల కోసం
అయితే తమిళనాడులో షోలు వేయాలని తనకు ఫోన్లు వస్తున్నట్లు కిరణ్ అన్నారు. ఈ మేరకు తను ఎంతో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తమిళ్ వెర్షన్ కాకపోయినా, తెలుగులో కనీసం ఐదు షోలు వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు తెలిపారు.