Kanagana Ranaut Emergency :బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ లీడ్ రోల్లో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ మూవీ సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 'ఎమర్జెన్సీ'కి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే కొన్ని మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు ఇటీవల సూచించింది. ఈ క్రమంలో చిత్రయూనిట్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా, సోమవారం వాదనలు జరిగాయి. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు సూచించిన కొన్ని కట్స్‌కు తాము అంగీకరిస్తున్నామని ఎమర్జెన్సీ మూవీ నిర్మాణ సంస్థ తరఫు న్యాయవాది తెలిపారు.
ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో ఓ నిర్ణయానికి రావాలని బాంబే హైకోర్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, నిర్మాణ సంస్థలను ఇటీవల ఆదేశించింది. దీంతో ఎమర్జెన్సీ మూవీలో కొన్ని కట్స్ సూచించిన బోర్డు వాటిని అంగీకరిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని చిత్రయూనిట్ కు తేల్చిచెప్పింది. దీనిపై నిర్మాణసంస్థ కొన్ని రోజుల సమయం కోరింది. బోర్డు సూచించిన మార్పులు చేస్తామని తాజాగా అంగీకరించింది. దీంతో తదుపరి విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. ఎట్టకేలకు మరో మూడు రోజుల్లో ఎమర్జెన్సీ మూవీ విడుదలపై ఓ క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) సెన్సార్ బోర్డుకు రాసిన లేఖ కాస్త దుమారమైంది. అందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కంగనా హత్య బెదిరింపులను సైతం ఎదుర్కొన్నారు.